సాక్షి, ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ముద్రణను రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బాగా తగ్గించిందట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్లను ముద్రించడం కోసం ఆర్డరును తగ్గించింది. ముఖ్యంగా కేంద్ర బ్యాంకు సహా ఇతర వాణిజ్య బ్యాంకుల్లో కరెన్సీ ఖజానా గది పూర్తిగా నిండిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. డీమానిటైజ్ చేసిన పాత రూ.500, రూ.1000నోట్లు కుప్పలు తెప్పలుగా పేరుకుపోవడంతో ...కొత్త కరెన్సీ ఖజానా గదులు ఖాళీ లేకపోవడంతో ప్రింటింగ్ ఇండెట్‌ను తగ్గించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
అయిదేళ్ల కనిష్ట స్థాయికి ప్రింటింగ్ ఆర్డర్లపై ఆర్‌బీఐకోత పెట్టిందని మింట్ రిపోర్ట్ చేసింది. విశ్వసనీయ వర్గాలకు చెందిన ఇద్దరు ప్రముఖుల ద్వారా ఈ సమాచారం అందినట్టు రిపోర్ట్ చేసింది. 2018 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ ఇండెంట్ 21 బిలియన్లు ఉండనుందని, ఇది గత ఏడాది 28 బిలియన్లతో పోలిస్తే చాలా తక్కువ అని భావిస్తున్నారు. గత ఐదేళ్లలో బ్యాంకు నోట్ల సగటు వార్షిక ఇండెంట్ 25 బిలియన్లుగా ఉంది.
50-60శాతం రద్దైన నోట్లను ఆర్‌బీఐకి బదలాయించినప్పటికీ తమ వద్ద చాలా తక్కువ స్థలం ఉందని పేరు చెప్పడానికి నిరాకరించిన ఒక ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. పాత రూ.500, 1000నోట్లు కుప్పలుతెప్పలుపేరుకుపోవడం, వీటిని నాశనం చేయడాకంటే ముందు లెక్కింపు పూర్తికావడంతో ఈ పరిస్థితి నెలకొందని వారు తెలిపారు. ఇండెంట్ తగ్గింపు అనేది ఉత్పత్తి సామర్థ్యాలు, పరిమితులకు లోబడి ఆర్‌బీఐ సహేతుకమైన నిర్ణయం తీసుకుంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూపు చీఫ్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ చెప్పారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా చిరిగిపోయిన నోట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. అయితే ప్రింటింగ్ ఇండెంట్ కోత నగదు లావాదేవీలపై మరింత భారం పెంచుతుందని చెప్పారు.
అయితే ఈ అంచనాలపై వ్యాఖ్యానించేందుకు ఆర్‌బీఐ నిరాకరించినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment