
‘జేఏసీ నుంచి ఉద్యోగులు ఎందుకు వెళ్లారో? ’
హైదరాబాద్: 'ప్రజలపై జేఏసీకి ప్రేమ ఉంది...ఎవరి పట్లా శత్రుత్వం లేదు.. ఉద్యోగ సంఘాల వారు ఏ ఇబ్బందుల కారణంగా జేఏసీ నుంచి వైదొలిగారో తెలియదు' అని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. శుక్రవారం టీజేఏసీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ జేఏసీలో ఇంకా ఎన్ని సంఘాలు ఉన్నాయో స్టీరింగ్ కమిటీ సమావేశం తర్వాతే తేలుతుందని చెప్పారు.
వచ్చే వారం జేఏసీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి, ప్రజా సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలతో విద్యావంతులు, ప్రజల సమస్యలపై గళమెత్తాలని.. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. ఎన్నికలొక్కటే ప్రజాస్వామ్యం కాదు.. ఎన్నికల అనంతరం కూడా ప్రజల తరఫున క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.