
వాట్ అయామ్ సేయింగ్..
గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో పుష్కరయాత్రికుల హడావుడి కన్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హడావుడి ఎక్కువైందట. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీల పేరుతో ఆయన చేసే హడావుడితో అధికారుల మైండ్లు బ్లాంక్ అయ్యాయట. ఇటీవల చంద్రబాబు అర్ధరాత్రి పూట రాజమండ్రిలోని ప్రధాన ఆర్‌టీసీ బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రయాణికులకు సౌకర్యాలు ఎలా అందుతున్నాయో తెలుసుకునేందుకు ఈ తనిఖీని చేపట్టారు.
ఆయన బస్టాండులో ఉన్న సమయంలోనే పొరుగు రాష్ట్రమైన కర్నాటకలోని మైసూరు నుంచి పుష్కరాలకు వచ్చిన యాత్రికులు బస్సులు అందుబాటులో లేక తాము పడుతున్న ఇబ్బందులను కన్నడంలో సీఎంకు వివరించటం ప్రారంభించారు. విషయం అర్థమైన ఒక అధికారి సీఎంకు చెప్పారు. దాంతో సీఎం తన పక్కనే ఉన్న ఆర్‌టీసీ ఉన్నతాధికారి ఒకరికి వెంటనే మైసూరుకు ప్రత్యేక బస్సు ఒకటి వేయమని ఆర్డర్ వేశారట. మైసూరుకు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుగా అనుమతులున్న బస్సునే వేయాలని, ఏ బస్సు పడితే ఆ బస్సు వేస్తే ఇబ్బందులు వస్తాయని క్షుణ్ణంగా వివరించారట.
ఇవేవీ పట్టించుకోని సీఎం నేను చెబితే కనీసం ఒక్క బస్సు కూడా వెయ్యకపోతే ఎలా అని కస్సుబుస్సులాడారట. నిబంధనలన్నీ చెప్పి ఆయన్ను ఒప్పించేందుకు ఆర్‌టీసీ అధికారులకు ప్రాణం పోయినంత పనైందట. అంతా విన్న తరువాత మరి వీరిని మైసూరుకు ప్రత్యేక బస్సు వేసి పంపిస్తున్నారా అని సీఎం ప్రశ్నించటంతో ఏమి చెప్పాలో అర్థం కాని అధికారులు... ఇప్పటికిప్పుడు మైసూరు బస్సు వేయటం కుదరదు, మాకు ఉన్న అధికారాల ఆధారంగా తిరుపతి వరకూ ప్రత్యేక బస్సు వేస్తాం, అక్కడి నుంచి వారిని బెంగళూరు వెళ్లి, అటు నుంచి మైసూరు వెళ్లమనండని చెప్పి ఆ బస్సులో ఎక్కి పంపించి ఊపిరి పీల్చుకున్నారట.