యంత్రంతో నీళ్లు పుట్టిస్తారా..? అయ్యే పనేనని.. అనుకుంటున్నారా? ఆలోచన ఉండాలిగానీ.. సాధ్యం కానిదేమీ లేదంటున్నారు ఇజ్రాయెల్‌కు చెందిన వాటర్ జెన్ వ్యవస్థాపకుడు మాక్సిమ్ పాసిక్! తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు వాటర్ జెన్ కంపెనీ ఓ వినూత్నమైన యంత్రాన్ని సృష్టించింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో భాగంగా బుధవారం జరిగే ఓ కార్యక్రమంలో పాసిక్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో వాటర్ జెన్ అవసరం, ప్రత్యేకతల గురించి ‘సాక్షి’ కథనం..
గాల్లోని తేమను ఒడిసిపట్టి..
తాగునీటి సమస్య పరిష్కారానికి చాలా కంపెనీలు సముద్రపు నీటిని మంచినీటిగా మార్చేందుకు, లేదంటే కలుషితమైన నీటిని శుభ్రం చేసేందుకు కొత్త కొత్త టెక్నాలజీలు అభివృద్ధి చేస్తున్నాయి. వాటర్‌జెన్ మాత్రం అన్నింటికంటే భిన్నంగా.. వినూత్నంగా గాల్లోంచే నీటిని పుట్టించే యంత్రాన్ని అభివృద్ధి చేసింది.
గాల్లో రకరకాల వాయువులతోపాటు నీటి ఆవిరి కూడా ఉంటుందన్నది తెలిసిందే. వాటర్ జెన్ యంత్రాలు ఈ తేమను ఒడిసిపట్టి, శుభ్రం చేసి అందిస్తాయి. కొద్దిపాటి కరెంటుతో గాలిని పీల్చుకుని.. అందులోని మలినాలు, ఉష్ణాన్ని తీసేయడం ద్వారా ఈ యంత్రం నీళ్లను సృష్టిస్తుంది. ‘కలుషితమైన నీటిని శుభ్రం చేయడం కంటే.. గాలిని శుభ్రం చేయడం చౌక. అందుకే మేం ఈ టెక్నాలజీని ఎన్నుకున్నాం’ అని మాక్సిమ్ పాసిక్ చెబుతున్నారు.
ఉత్పత్తి ఖర్చు చాలా తక్కువ..
వాటర్ జెన్ యంత్రాలు మన అవసరాలకు తగ్గట్టుగా మూడు రకాల సైజుల్లో లభిస్తాయి. కుటుంబ అవసరాల కోసం రోజుకు 20 లీటర్ల నీటిని ఉత్పత్తి చేయగల యంత్రంతోపాటు రోజుకు 600, 4,500–6 వేల లీటర్ల నీటిని తయారు చేయగల యంత్రాలను సిద్ధం చేసినట్లు పాసిక్ తెలిపారు. గాల్లోని తేమశాతాన్ని బట్టి ఒక్కో లీటర్ నీరు ఉత్పత్తి చేసేందుకు అయ్యే ఖర్చు రూ.2 మించదని అంచనా. ఉదాహరణకు 30 డిగ్రీల ఉష్ణోగ్రత.. గాల్లో తేమశాతం 70 శాతం వరకూ ఉన్న ప్రాంతాల్లో నీటి ఉత్పత్తి ఖర్చు లీటర్‌కు రూపాయికి మించదు.
అంతేకాదు.. గాల్లోని ధూళి, ఇతర కాలుష్యాలను మొత్తం తొలగించేందుకు అత్యాధునిక ఏర్పాట్లు ఉన్న కారణంగా ఈ యంత్రం ద్వారా ఇళ్లలో స్వచ్ఛమైన గాలిని కూడా పొందవచ్చు. ఓజోన్ వాయువుతో శుద్ధి చేయడం ద్వారా నీళ్లు మరింత ఎక్కువ కాలం తాజాగా ఉండటంతోపాటు వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్‌ల సమస్య ఉండదు. యంత్రం నిర్వహణకు అయ్యే ఖర్చు నెలకు రూ.300 వరకూ ఉంటుందని అంచనా.
వరదలు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తుల సమయంలో జనాన్ని ఆదుకునేందుకు లారీలోనూ ఒద్దికగా అమరిపోతుంది వాటర్ జెన్ యంత్రం. వీటితోపాటు మిలటరీ అవసరాల కోసం మొబైల్ యంత్రాన్ని, ఎయిర్ కండీషనర్ల నుంచి విడుదలయ్యే నీటిని శుద్ధి చేసేందుకు, గాల్లోని తేమను తొలగించడం ద్వారా పదార్థాలు మరింత ఎక్కువకాలం నిల్వ ఉండేలా చేసేందుకు కూడా ఈ కంపెనీ ప్రత్యేకంగా యంత్రాలను తయారు చేసింది. భారత్‌లోని చెన్నైతోపాటు అనేక ఇతర దేశాల్లో ప్రస్తుతం వాటర్‌జెన్ యంత్రాలు దాదాపు పది వేలు పనిచేస్తున్నాయి.
రానున్న ఐదేళ్లలో ప్రపంచంలోని సగం మందికి వాటర్ జెన్ ద్వారా తాగునీరు అందించేందుకు వాటర్‌జెన్ ప్రయత్నిస్తోంది. ఈ యంత్రాల కోసం భారత్‌తోపాటు అనేక ఇతర దేశాల నుంచి డిమాండ్ ఉంది. అతితక్కువ ఖర్చుతో స్వచ్ఛమైన తాగునీరు అందించడం ద్వారా సామాన్యుల ప్రాణాలు కాపాడాలన్నది
మా లక్ష్యం. – మాక్సిమ్ పాసిక్
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment