రాజధానిలో పదివేల ఎకరాలు తరచూ మునక!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సమీకరించిన భూమిలో పదివేల ఎకరాలు తరచూ ముంపునకు గురవుతున్నదిగా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) తేల్చింది. ప్రధానంగా కొండవీటి వాగు 29.50 కిలోమీటర్ల పొడవునా 7,300 క్యూసెక్కుల వరదనీరు కేపిటల్ సిటీ మీదుగా ప్రవహిస్తుందని పేర్కొంది. ఈ వరదలో మొత్తం 13,500 ఎకరాలు మునిగిపోతుందని, ఇందులో 10,600 ఎకరాలు కేపిటల్ సిటీలో ఉందని తేల్చింది. ఇందుకోసం కాంటూరు సర్వే చేయించాలని నిర్ణయించింది.
ఈ బాధ్యతల్ని ఆర్వీ అసోసియేషన్‌కు రూ.1.70 కోట్లకు అప్పగించింది. అలాగే వరద తీవ్రతను గుర్తించేందుకు, తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యల్ని సూచించేందుకు అనుభవమున్న హైడ్రాలజికల్ కన్సల్టెంట్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా కృష్ణా బ్యారేజీ వద్ద నీటి అడుగుభాగంలో సర్వేకోసం ఐఐజీ టెక్నాలజీస్‌ను కన్సల్టెంట్‌గా నియమించింది. రూ.1.53 కోట్లకు ఈ బాధ్యతల్ని అప్పగించింది. కృష్ణా నది కాంటూరు టొపో షీట్‌ను రూపొందించడంతోపాటు కృష్ణా వరదకట్టల సమీపంలో నీటి అడుగున ఇసుక, పూడిక ఎంత ఉందో తేల్చనున్నారు.
వరద కట్టల్ని మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. కొండవీటివాగు ద్వారా వచ్చే వరదను నియంత్రించే చర్యలకు సంబంధించిన సర్వేను నవంబర్ నెలాఖరుకు పూర్తి చేయనున్నారు. ఇదిలా ఉండగా జియో టెక్నికల్ సర్వే బాధ్యతల్ని రూ.6.30 లక్షలకు ఎస్.శ్రీధర్ అనే వ్యక్తికి అప్పగించారు. భూపటిష్టత సామర్థ్యం ఈ సర్వే ద్వారా తేలనుంది. అదేవిధంగా రాజధానిలోని 29 గ్రామాల్ని ఇంటిగ్రేట్ చేసే బాధ్యతల్ని ఆర్వీ అసోసియేషన్‌కు రూ.2.10 కోట్లకు అప్పగించారు. ఈ పనులన్నింటినీ నవంబర్ నెలాఖరుకు పూర్తి చేయనున్నారు.
53 వేల ఎకరాల అటవీ భూమి డీ నోటిఫై
రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున అటవీ భూముల్ని డీ నోటిఫై చేయించి వాటిని పారిశ్రామికవేత్తలకు, వాణిజ్యవేత్తలకు కేటాయించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన చట్టంలో రాజధాని నిర్మాణానికి అవసరమైతే అటవీ భూముల్ని డీ నోటిఫై చేస్తామని కేంద్రప్రభుత్వం పేర్కొనడం తెలిసిందే. అయితే రాష్ట్రప్రభుత్వం రాజధానికోసం రైతుల నుంచి భూముల్ని సమీకరించిన తరువాత ఇప్పుడు పారిశ్రామికవేత్తలకు, ఇతర వాణిజ్యవేత్తలకు భూముల్ని కేటాయించేందుకు వీలుగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 53 వేల ఎకరాల అటవీ భూమిని డీ నోటిఫై చేయాల్సిందిగా కేంద్రప్రభుత్వాన్ని కోరడం గమనార్హం.