ప్రైమరీ స్కూళ్ల పరిధిలోకి 12 వేల అంగన్‌వాడీ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో 11,831 అంగన్‌వాడీ కేంద్రాలు అనుసంధానమయ్యాయి. ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రీ ప్రైమరీ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగించాలని విద్యాశాఖ ఇటీవల నిర్ణయించింది. దీంతో ఇప్పటికే 7,602 అంగన్‌వాడీ కేంద్రాలను గతంలోనే ప్రాథమిక పాఠశాలల పరిధిలోకి తరలించగా, బడిబాటలో భాగంగా తాజాగా 4,229 అంగన్‌వాడీ కేంద్రాలను తరలించింది. వాటిల్లో బోధించేందుకు అవసరమైన పాఠ్యాంశాలను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఇదివరకే రూపొందించింది.
మరోవైపు మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా పలు పాఠ్యాంశాలను అమలు చేస్తోంది. ప్రస్తుతం ఆ రెండింటినీ పరిశీలించి విద్యార్థులకు బోధన చేపట్టేలా విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రం మొత్తంలో 16,332 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, 15,446 గ్రామాల్లో 31,414 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. మరో 8,177 గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు వేర్వేరుగా కొనసాగుతున్నాయి. అయితే ఆ గ్రామాల్లో కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో తగిన వసతులు, తరగతి గదులు లేనందున వాటిని పాఠశాలల పరిధిలోకి తరలించలేదు. పాఠశాలల్లో వసతులు కల్పించి వాటిని కూడా దశల వారీగా పాఠశాలల పరిధిలోకి తీసుకొచ్చేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది.