‘గ్రేటర్’ గొడవలపై 14 కేసులు
ఉత్తమ్, షబ్బీర్‌లపై దాడి కేసులో ముగ్గురు అరెస్టు
ఎంపీ అసదుద్దీన్ సమక్షంలోనే వారిపై దాడి: డీసీపీ
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో చోటుచేసుకున్న పలు ఉదంతాలకు సంబంధించి పోలీసులు 14 కేసులు నమోదు చేశారు. వీటిలో అత్యధికం మజ్లిస్‌పై నమోదయ్యాయి. పశ్చిమ మండలంలో నాలుగు, తూర్పు మండలంలో మూడు, మధ్య మండలంలో ఒకటి, దక్షిణ మండలంలో ఆరు కేసులతో పాటు ముందస్తు అరెస్టుకు సంబంధించి దక్షిణ మండల పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు. వీటి దర్యాప్తు తీరుతెన్నులను నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి బుధవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు.
మంగళవారం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహ్మద్ షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కార్ల అద్దాలు ధ్వంసం, షబ్బీర్ పై దాడి ఘటనల్లో ముగ్గురు నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ వెల్లడించా రు. ఈ ఘటనలో హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీపైనా కేసు నమోదు చేశామని, వీడియో ఫుటేజీలను పరిశీలించి ఆయనపై చర్యలు తీసుకుంటామన్నారు. ‘‘ఈ కేసులో ఓల్డ్ మలక్‌పేట్‌కు చెందిన సయ్యద్ అబ్దాహు ఖాద్రీ అలియాస్ కషఫ్(21), కాలాపత్తర్‌కు చెందిన షేక్ ఆబేద్(38), డబీర్‌పురాకు చెందిన మహ్మద్ మసీవుద్దీన్ అలియాస్ మసీ (34)లను అరెస్ట్ చేశాం.
అసద్ సమక్షంలోనే దాడి జరిగినట్లు ఆధారాలున్నాయి. జంగంమెట్ బీజేపీ అభ్యర్థి కౌడి మహేందర్‌పై మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ దాడి చేసిన సంఘటనలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్ట కింద కేసు నమోదు చేశాం. రెయిన్‌బజార్, సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్లలో కూడా పోలింగ్ కేసులు నమోదయ్యా యి. మజ్లిస్ పార్టీ వెబ్ మీడియా నిర్వహిస్తున్న సయ్యద్ అబ్దాహు ఖాద్రీ ఇంజనీరింగ్ చేశాడు. షబ్బీర్ అలీపై మీర్ చౌక్ పోలీస్‌స్టేషన్ వద్ద పిడిగుద్దులతో దాడి చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా అని తేల్చేందుకు నిందితుల సెల్‌ఫోన్‌లోని కాల్ డేటాలను పరిశీలించనున్నాం’’ అన్నారు.
మరోవైపు మలక్‌పేట మజ్లిస్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలపై స్థానిక ఠాణాలో కేసు నమోదైంది. అసద్, అక్బర్ ప్రోద్బలంతోనే బలాల తన అనుచరులతో కలసి హత్యాయత్నం చేశారని అక్బర్‌బాగ్ డివిజన్ ఎంబీటీ అభ్యర్థి అంజదు ల్లా ఖాన్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై, అనుచరులపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 147,148,149,188,109, 120బి, 307 సెక్షన్ల కింద ఎమ్మెల్యే బలాల, ఆయన గన్‌మెన్ జానీ, అలీ(కాలా డేరా), అక్బర్‌బాగ్ మజ్లిస్ అభ్యర్ధి మినాజుద్దీన్‌లపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ గంగారెడ్డి తెలిపారు. అసద్, అక్బర్‌లపై 109, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.