రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీ నామా లేఖను టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సోమవారం పంపించారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం బాధాకరమని, ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ చేస్తున్న రాజీనామాను ఆమోదించాలని ఆ లేఖలో మల్లేశం కోరారు. ఇదిలా ఉండగా బల్దియా ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతోంది. పార్టీ పరాజయం నేపథ్యంలో ఇన్నాళ్లూ పార్టీలో ఉన్న విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. పలువురు పార్టీ నేతలు డీసీసీ అధ్యకుడు క్యామపై మాటల దాడికి దిగడంతో ఆయన మనస్తాపం చెంది అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది. అలాగే పార్టీ అధిష్టానం నుంచి రాజీనామా చేయాలని ఒత్తిడి రావడంతో ఆయనీ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
దానం రాజీనామా ఆమోదం: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు దానం నాగేందర్ చేసిన రాజీనామా ఆమోదానికి అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దానం రాజీనామాను ఆమోదించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ నుంచి సూచనలు అందినట్లుగా తెలిసింది. దీంతో నేడో, రేపో దానం రాజీనామాకు ఆమోదముద్ర వేయనున్నట్లు టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి.