హైదరాబాద్ అభివృద్ధి మా చలవే..
► గ్రేటర్‌పై ఆశల జల్లు
► ప్రతి ఇంటికి ఉచిత నల్లా, గ్యాస్‌పైప్‌లైన్
► ప్రపంచస్థాయి ప్రమాణాలతో డ్రైనేజీ వ్యవస్థ
► టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి
గ్రేటర్ పీఠంపై జెండా ఎగరేసేందుకు విపక్షాలు కంకణం కట్టుకున్నాయి. గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మహానగర ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ-టీడీపీ కూటమి ఆదివారం గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోలను ఆవిష్కరించాయి. వాటిలో పేదలకు వరాల జల్లు కురిపించాయి. హైదరాబాద్ నగరంలోని ప్రతి గృహానికి ఉచిత వంట గ్యాస్ పైప్‌లైన్ వేస్తామని, వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో డ్రైనేజీ వ్యవస్థలో మార్పు తెస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. పేదలకు పక్కా ఇళ్లు, మొబైల్ ఆస్పత్రులు, ప్రతి ఇంటికి ఉచిత రక్షిత మంచి నీరు అందిస్తామని బీజేపీ-టీడీపీ కూటమి ప్రకటించింది.
హైదరాబాద్: ‘అప్నా షహర్, సబ్‌కా షహర్, హమ్ సబ్‌కా షహర్’.. గ్రేటర్ పోరులో కాంగ్రెస్ నినాదమిది. ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మొత్తం 28 ప్రాధాన్య అంశాలతో కార్యచరణను ప్రకటించారు. ఈ మేనిఫెస్టో పూర్తిగా ఇంగ్లిషులో వూత్రమే ఉండటం కొసమెరుపు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిధుల కేటాయింపు, అభివృద్ధిపై ‘ద గోల్డెన్ డికేడ్ ఆఫ్ హైదరాబాద్’ పేరిట కరపత్రాన్ని ఆవిష్కరించారు. తమ హయాంలోనే నగరాభివృద్ధి జరిగిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. అభివృద్ధి తామే చేశామంటూ టీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం సిగ్గుచేటన్నారు. నగరానికి గోదావరి నీటి తరలింపు పనులు 95 శాతం కాంగ్రెస్ హయాంలో పూర్తయ్యాయన్నారు. సీఎం కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని విమర్శించారు. మెట్రోరైల్ ప్రాజెక్టు ఆలస్యానికి టీఆర్‌ఎస్ ప్రధాన కారణమని, అలైన్‌మెంట్ మారుస్తామని ప్రకటించి.. మళ్లీ పాతదే అంటూ గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. ఫ్లై ఓవర్లు, స్కైవేలంటూ మభ్యపెడుతున్నారని, నగరంలోని మురికివాడల్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. బిల్డర్ అసోసియేషన్ వెంచర్లలలో 5 శాతం బలహీనవర్గాల కోటాను కేసీఆర్ ఎత్తేశారని, అలాంటి వ్యక్తి మూడు లక్షల ఇళ్లు కట్టిస్తారంటే ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. జాగో, బాగో అంటూ సెటిలర్స్ ఇళ్లు కూల్చి గందరగోళం సృష్టించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సీమాంధ్రులకు పూర్తి అండగా ఉంటుందని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఆదాయం రూ.600 కోట్ల నుంచి 5 వేల కోట్లకు పెంచిన ఘనత తమదేనన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి విపక్షనేత షబ్బీర్ అలీ, ఉపాధ్యక్షుడు నాగయ్య, మేనిఫెస్టో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
తండ్రిని మించిన తనయుడు కేటీఆర్: షబ్బీర్
వాగ్దానాలను మరిచిపోవడంలో కేటీఆర్ తండ్రిని మించిపోయాడని శాసనమండలి విపక్షనేత షబ్బీర్ అలీ విమర్శించారు. వంద సీట్లు గెలవకపోతే రాజీనామా చేస్తానని చాలెంజ్ చేసి అంతలోనే మాట మార్చారన్నారు. టీఆర్‌ఎస్ 100 సీట్లు సాధిస్తే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధమన్నారు. టీఆర్‌ఎస్ విడుదల చేసిన మేనిఫెస్టో 2014 సాధారణ ఎన్నికలప్పుడు కేసీఆర్ ప్రకటించినట్టే ఉందన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట మార్చారని, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు హామీని ప్రస్తావించడమే లేదన్నారు. కేసీఆర్ మేనిఫెస్టోకే దిక్కులేనప్పుడు కేటీఆర్‌ది ఎలా అమలవుతుందని ప్రశ్నించారు.
మేనిఫెస్టో ముఖ్యాంశాలు
► ప్రతీ ఇంటికి ఉచిత రక్షిత మంచినీరు, ఉచిత వంట గ్యాస్ పైప్‌లైన్
► వచ్చే 25 ఏళ్లకు అనుగుణంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో డ్రైనేజ్ వ్యవస్థ
► హుస్సేన్‌సాగర్, మూసిని కాలుష్య రహితంగా మార్పు
► విదేశీ చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు ఎన్‌ఆర్‌ఐ సెల్ ఏర్పాటు
► హైదరాబాద్ హెరిటేజ్‌ను కాపాడడానికి ప్లాస్టిక్‌పై నిషేధం
► పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక కార్యచరణ
► యువతకు అన్ని రంగాల్లో నైపుణ్యం పెంచేందుకు శిక్షణ తరగతులు
► యుద్ధప్రాతిపదికన వేస్ట్ మేనేజ్‌మెంట్ పవర్‌ప్లాంట్ల నిర్మాణం
► క్రీడా ప్రోత్సాహంపై ప్రత్యేక దృష్టి
► శ్మశానవాటికలను పెంచడంతో పాటు అధునాతన సౌకర్యాల కల్పన
► ప్రతి డివిజన్‌లోనూ మొబైల్ హెల్త్ ట్రాన్స్‌పోర్ట్ సేవలు. ఇందులో ఉచిత వైద్య పరీక్షలతో పాటు అత్యవసర, పీడియాట్రిక్, గైనిక్ నిపుణుల సేవలు
► ప్రతి డివిజన్‌లోనూ ఓపెన్ స్కూల్ ఏర్పాటుతో పాటు పౌష్ఠికాహారం, ఉచిత పుస్తకాల పంపిణీ. విద్య, యూనిఫాం, షూస్, స్కూలు బ్యాగులు అందజేత
► ప్రతి స్లమ్‌లోనూ ఒక బేబీ కేర్ సెంటర్ ఏర్పాటు
► 24 గంటలు విద్యుత్ సరఫరా, సోలార్ సిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు
► ఇళ్లులేని వారందరికీ రెండు పడకల ఇళ్లు నిర్మించి ఇవ్వడం.
► ఇంటి నిర్మాణ అనుమతులు మరింత సరళతరం.
► దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోగా అనుమతులు మంజూరు
► చార్మినార్, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, హైకోర్టు వంటి చారిత్రక కట్టడాల ఆధునికీకరణ. పర్యాటక ప్రాంతాలకు మరింత ప్రోత్సాహం
► భూగర్భ జలాల పెంపునకు మరింత ప్రోత్సాహం
► యువతకు అన్ని రంగాల్లో నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహణ
► క్రీడల ప్రోత్సాహంపై ప్రత్యేక దృష్టి