14 నెలల్లోపంప్‌హౌస్‌ల పూర్తి | 14 months to complete the Pump House | Sakshi
Sakshi News home page

14 నెలల్లోపంప్‌హౌస్‌ల పూర్తి

Published Tue, Jun 21 2016 2:57 AM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

14 నెలల్లోపంప్‌హౌస్‌ల పూర్తి - Sakshi

14 నెలల్లోపంప్‌హౌస్‌ల పూర్తి

* కాళేశ్వరంపై అధికారులకు మంత్రి హరీశ్‌రావు డెడ్‌లైన్
* బీహెచ్‌ఈఎల్, ట్రాన్స్‌కో అధికారులతో భేటీ
* రెండు రోజుల్లో యాక్షన్ ప్లాన్ తయారీకి ఆదేశం
* 15 రోజులకోసారి సమీక్ష చేయాలని సూచన

సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మరింత ఊపందుకోనున్నాయి. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం నిర్ణీత కాల వ్యవధిని ఖరారు చేసింది. 14 నెలల్లో పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు డెడ్‌లైన్ పెట్టింది.

సోమవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సచివాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చించారు. బీహెచ్‌ఈఎల్, ట్రాన్స్‌కో, నీటిపారుదలశాఖ అధికారులతో జరిగిన ఈ సమావేశంలో ప్యాకేజీ-6, ప్యాకేజీ-8లకు చెందిన పంప్‌హౌస్‌ల నిర్మాణాన్ని 2017 జూలై చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ప్యాకేజీ-20 పంప్ హౌస్ నిర్మాణాన్ని 2017 డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని లక్ష్యం విధించారు. ఏ పని ఎప్పటిలోగా పూర్తి చేయాలన్న అంశంపై వర్క్‌షాపు చార్ట్‌ను రూపొందించారు.  

హరీశ్‌రావు ఆదేశాల మేరకు రెండు రోజుల్లో కాళేశ్వరం పంప్‌హౌస్‌ల నిర్మాణం యాక్షన్‌ప్లాన్‌ను అధికారులు సిద్ధం చేయనున్నారు. పంప్‌హౌస్‌ల నిర్మాణ పనులను ఇరిగేషన్, బీహెచ్‌ఈఎల్, ట్రాన్స్‌కో అధికారులు ప్రతి 15 రోజులకోసారి సమీక్షించాలని, నెలకోసారి అధికారుల బృందం, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పర్యటించి అక్కడ బీహెచ్‌ఈఎల్ కర్మాగారంలో రూపొంది స్తున్న పంపుల తయారీని స్వయంగా పర్యవేక్షించాలని మంత్రి కోరారు.

పంపులు, ఇతర యంత్రాల ఏర్పాటు కోసం సివిల్ వర్క్స్‌ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్యాకేజీ-6, ప్యాకేజీ-10లకు చెందిన డిజైన్లను యుద్ధప్రాతిపదికన రూపొందించి ఆమోదం తీసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర ప్రాజెక్టుద్వారా పైపులతో నీటిపారుదల వ్యవస్థను అమలు చేస్తున్న ‘సంకేత్’ సంస్థ ప్రతినిధులు సచివాలయంలో మంత్రి హరీశ్‌రావుకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ విధానం వల్ల భూసేకరణ సమస్య తీవ్రతను బాగా తగ్గించవచ్చునని డిండి, సీతారామ తదితర ప్రాజెక్టులలో ఈ విధానం లాభదాయకమని తెలిపారు.

భూ సేకరణ వ్యయం కూడా తగ్గుతుందని చెప్పారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలలో పైప్‌లైన్ ద్వారా నీటిపారుదల విధానం విజయవంతం అయిందన్నారు. కాగా, ఈ విధానాన్ని అధ్య యనం చేయాలని సీఈలను మంత్రి ఆదేశించారు. బీహెచ్‌ఈఎల్ (భోపాల్) జనరల్ మేనేజర్ నరేంద్రకుమార్, సంస్థ ప్రతి నిధులు పూర్ణచంద్రరావు, టీఎస్ రావు, ట్రాన్స్‌కో డెరైక్టర్ సూర్యప్రకాశ్, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురశీధర్‌రావు, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, చీఫ్ ఇంజనీర్లు ఎన్. వెంకటేశ్వర్లు, బి. హరిరావు, ఎస్ గోవిందరావు, డిజైన్స్ సీఈ నరేందర్‌రెడ్డి, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
 
28న ఇజ్రాయెల్‌కు హరీశ్
ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు మంత్రి హరీశ్‌రావు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. సాగునీటి వనరుల కల్ప న, నీటి వినియోగం తదితర అంశాలపై అధ్యయనానికి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి నేతృత్వంలోని బృం దం ఇజ్రాయెల్‌లో పర్యటించనుండగా, ఆ బృందంలో మంత్రి హరీశ్‌రావుకు స్థాన ం లభించింది. ఈ బృందంలో ఎంపీ కవిత కూడా ఉన్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement