
ప్రతిదీ పర్యవే‘క్షణమే’
అందుబాటులోకి రానున్న సైబరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్
ఐటీ కారిడార్‌లోని 150 సీసీ కెమెరాలతో అనుసంధానం
భవిష్యత్‌లో ఠాణాలోని కెమెరాలు కూడా అనుసంధానం?
అన్ని పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం
సిటీబ్యూరో: నగరానికే తలమానికమైన ఐటీ కారిడార్‌లో ఏం జరిగినా ఇట్టే సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయానికి తెలిసిపోనుంది. మహిళల భద్రతతో పాటు ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు భౌతికంగా అనేక చర్యలు తీసుకున్న పోలీసులు... కొన్ని సందర్భాల్లో తాము అక్కడ లేకున్నా ఏం జరుగుతుందనేది చూసుకొనేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్, నానక్‌రామ్‌గూడలలో దాదాపు 150కి పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసిన పోలీసులు...వాటిని సైబరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.
మొదట ఐటీ కారిడారే ఎందుకంటే..
ఐటీ కారిడార్‌లో వందలాది సాఫ్ట్‌వేర్ కంపెనీలున్నాయి. నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. పురుషులతో పాటు మహిళా ఉద్యోగులూ ఎక్కువగానే ఉన్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల లైఫ్‌స్టైల్‌కు తగ్గట్టు స్టార్ హోటళ్లు పుట్టుకొచ్చాయి. టూరిజానికి సంబంధించి హాట్‌స్పాట్‌లు ఉన్నాయి. అలాగే ఈ ప్రాంతం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు నిలయంగా ఉంది. గతంలో ముంబైలో ఉగ్రవాదులు దాడులకు హోటళ్లను ఎంచుకోవడం, ప్యారిస్‌లో కూడా అదే పంథాలో ముష్కరులు నరమేధం సృష్టించడంతో ఐటీ కారిడార్‌లోని కంపెనీలు, హోటళ్లలో భద్రతను పెంచుకోవాలని ఇప్పటికే పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పలు సందర్భాల్లో సూచించారు. ఇక్కడ కూడా అటువంటి దాడులు జరిగే అస్కారముందని ఐబీ హెచ్చరికల నేపథ్యంలో గత కొన్ని నెలల నుంచి పూర్తి స్థాయిలో భద్రతపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయం నుంచే ఐటీ కారిడార్‌లో జరిగే ప్రతి దృశ్యాన్ని వీక్షించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు రూపకల్పన చేశారు. సీసీకెమెరాల అనుసంధాన ప్రక్రియ పూర్తయింది. అలాగే గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిల్లో ఏర్పాటుచేసిన ఈ సీసీకెమెరాలను ఆయా ఠాణాలకు కూడా అనుసంధానిస్తున్నారు. ఎక్కడేం జరిగినా పోలీసులు క్షణాల్లో చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే అన్ని ఠాణాల సిబ్బందితో నేరుగా మాట్లాడేందుకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెస్తున్నారు.
దశల వారీగా మిగతా ప్రాంతాలకు..
‘కమిషనరేట్ పరిధిలోని చాలా పోలీసు స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. ఈ పనులు పూర్తికాగానే ఆయా స్టేషన్ల పరిధిలోని సీసీటీవీ కెమెరాలను డివిజన్‌లకు, అక్కడ నుంచి జోన్ కార్యాలయానికి, ఆ తర్వాత కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానిస్తాం. అన్ని ఠాణాలు కమాండ్ కంట్రోల్ సెంటర్ పర్యవేక్షణలోకి వస్తే సిబ్బంది పనితీరుపై కూడా నిఘా పెట్టే అవకాశముంది. ఠాణాకు వచ్చిన ఫిర్యాదుదారులతో సిబ్బంది వ్యవహరించే తీరు కళ్లకు కట్టినట్టు కనబడుతుంది. ఎక్కడే ఎలాంటి ఘటన జరిగినా వెంటనే అప్రమత్తం చేసే అవకాశం ఉంటుంద’ని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.