
‘జులాయి’ దొంగలు!
తొలిసారిగా స్నాచింగ్స్‌కు దిగిన ‘ఐటీ కారిడార్ స్నాచర్లు’
40 నిమిషాల వ్యవధిలో నాలుగు ప్రాంతాల్లో యత్నాలు
ఒకచోటే సక్సెస్... మూడు చోట్ల ఫెయిల్
‘పని’ ప్రారంభించిన గంటలోనే పోలీసుస్టేషన్‌కు చేరిన ద్వయం
సిటీబ్యూరో/గచ్చిబౌలి: అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన జులాయి సినిమా గుర్తుందా..! అందులో హాస్యనటుడు బ్రహ్మానందం ఓ దొంగ పాత్ర పోషించారు. బతుకుతెరువు కోసం రోడ్డు మీద స్నాచింగ్, పార్కులో దోపిడీకి ప్రయత్నించే ఆ క్యారెక్టర్ తక్షణం దొరికేస్తుంది. మంగళవారం సైబరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నాలుగుచోట్ల పంజా విసిరిన ‘అమెచ్యూర్డ్ స్నాచర్ల’ వ్యవహారమూ దాదాపు ఇలాంటిదే. అయితే ఆ సినిమాలో బ్రహ్మానందం పనివాడిగా ఏసీపీ ఇంటికి చేరగా... ఇక్కడ మాత్రం స్నాచర్లు కటకటాల్లోకి వెళ్లారు. 40 నిమిషాల్లో నాలుగు ప్రయత్నాలు చేసి, ఒకదాంట్లో సక్సెస్ అయిన ‘ఐటీ స్నాచర్లు’ సీన్ కట్ చేస్తే ఓ వాహనచోదకుడికి చిక్కి అర్ధగంటలోనే గచ్చిబౌలి ఠాణాకు వెళ్లారు. బాధితులు ఇచ్చిన సమాచారంతో సీసీ కెమెరాల సాయంతో అనుమానితులను వెంటనే గుర్తించామని గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ జె.రమేష్‌కుమార్ తెలిపారు.
వృత్తులు వేరైనా కలిసి ‘పని’ చేద్దామని...
కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన తాడిశెట్టి నాగబాబు అలియాస్ నాని (22) శంషీగూడ, ఎల్లమ్మబండలో స్థిరపడ్డాడు. ఇంటర్మీడియట్ విద్యను మధ్యలోనే మానేసిన ఇతగాడు ఓ ప్రముఖ వస్త్రదుకాణంలో కొన్నాళ్ల పాటు పని చేశాడు. కూకట్‌పల్లిలోని విజయ్‌నగర్‌కాలనీకి చెందిన షాన్ హుస్సేన్ అడెస్సా(21) కూడా ఇంటర్మీడియట్ డ్రాపౌట్. ప్రస్తుతం ఓ ఐస్ క్రీమ్ దుకాణంలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం స్నాచింగ్స్‌కు పథకం వేశారు. మంగళవారం ఉదయం ‘యమహా ఎఫ్‌జడ్’ బైక్‌పై కూకట్‌పల్లి నుంచి బయలుదేరి గచ్చిబౌలి వచ్చారు. తొలిసారిగా రంగంలోకి దిగడంతో ఎలాంటి ముసుగులు ధరించలేదు సరికదా... జాగింగ్‌కు వెళ్తున్నట్లు షార్ట్స్, టీ-షర్ట్స్‌ల్ని ‘యూనిఫాం’గా వేసుకుని రంగంలోకి దిగారు.
సీన్-1
ఉదయం 11.00 గంటలకు విప్రో జంక్షన్ సమీపంలోకి వచ్చిన ఈ ద్వయం తొలి ప్రయత్నం చేసింది. స్నేహితురాలితో కలిసి బ్యాంక్‌కు వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అశ్విని మెడలోని బంగారు గొలుసును టార్గెట్ చేశారు. చైన్ తెగినప్పటికీ... అది వీరి చేతికి రాకుండా అక్కడే పడిపోవడంతో పరారయ్యారు. ఈ విషయం పోలీసు కంట్రోల్ రూమ్‌కు చేరడంతో వేట మొదలైంది. అక్కడి నుంచి ఐటీ కారిడార్‌లో ఉన్న కాంటినెంటల్ హస్పిటల్ వైపు వెళ్లాగా అక్కడ పోలీసు వాహనం కనిపించడంతో దిశ మార్చుకుని కార్వి కార్యాలయం వైపు వెళ్లారు.
సీన్-2
11.15 గంటలకు స్నేహితురాలితో కలిసి ఇంటర్వ్యూ కోసం వెళుతున్న కల్పనాలత అనే మహిళ మెడలోని చైన్‌ను లాక్కునే ప్రయత్నం చేసి సఫలీకృతులయ్యారు. అక్కడి నుంచి గౌలిదొడ్డి వైపు వెళ్లగా అక్కడా పోలీసు వాహనం కనిపించేసరికి... వెనక్కు తిరిగి సీఏ కంపెనీ పక్క రోడ్డులోంచి లోపలికి వెళ్లి తిరిగి మళ్లీ విప్రో జంక్షన్‌కు వచ్చారు. ఆ చౌరస్తా అవతలి వైపు పోలీసులు ఉండటంతో ముందుకు వెళ్లేందుకు సంశయించారు. దీంతో అక్కడి నుంచి తమ వాహనాన్ని ట్రిపుల్ ఐటీ వైపు మళ్లించారు.
సీన్-3
ఉదయం 11.35 గంటలకు హిల్ రిడ్జ్ విల్లాస్ ప్రాంతానికి చేరుకున్న ఇద్దరూ... నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ మెడలోని చైన్ లాగే ప్రయత్నం చేశారు. ఆమె నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో ముందుకు వెళ్లారు. మొదటి ఘటనలో బాధితురాలు చెప్పిన స్నాచర్ల ఆనవాళ్లతో పోలీసులు నానక్‌రాంగూడ, వరుణ్ మోటార్స్, గౌలిదొట్టి మార్గాల్లో పోలీసు వాహనాలు మోహరించారు. సీసీ కెమెరాల ఆధారంగా స్నాచర్లు ఐటీ కారిడార్ దాటి వెళ్లలేదని కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్థారించింది. దీంతో ట్రిపుల్ ఐటీ జంక్షన్‌లో ఉన్న ఏఎస్సైను అప్రమత్తం చేశారు.
సీన్-4
11.40 గంటల ప్రాంతంలో పోలీసులు అనుమానించినట్లే స్నాచర్ల ద్వయం ట్రిపుల్ ఐటీ జంక్షన్ ప్రాంతానికి వచ్చింది. అక్కడ వీరి ఎదురుగా ఉన్న మార్గంలో రెడ్ సిగ్నల్ పడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే మరో మహిళ మెడలోని చైన్ లాగే ప్రయత్నం చేస్తుండగా కారులో వస్తున్న బంజారాహిల్స్‌కు చెందిన నర్సింహ్మారెడ్డి వీరిని గమనించారు. సిగ్నల్ వద్ద పట్టుకుని అక్కడే ఉన్న గచ్చిబౌలి ఏఎస్సై సలామ్, ట్రాఫిక్ హోంగార్డు రాంబాబుకు అప్పగించారు.