
కెమెరాలతో స్నాచర్ల ఆటకట్టించాం..
మాదాపూర్ డీసీపీ కార్తికేయ
ఇద్దరు నిందితుల డిమాండ్
మూడు గొలుసులు స్వాధీనం
గచ్చిబౌలి: ఐటీ కారిడార్‌లో సీసీ కెమెరాల నిఘా ఉండటంతో స్నాచర్ల ఆటకట్టించామని మాదాపూర్ డీసీపీ కార్తికేయ తెలిపారు. మంగళవారం ఐటీ కారిడార్‌లో జరిగిన స్నాచింగ్, నిందితుల అరెస్టు వివరాలను గురువారం ఆయన గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు. డీసీపీ కథనం ప్రకారం... 7వ తేదీ ఉదయం ఉదయం 11 గంటలకు యమహా బైక్‌పై వచ్చిన తాడిశెట్టి నాగబాబు(2), షాన్ హుస్సేన్ అడెస్సీ(21)లు విప్రో జంక్షన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అశ్విని మెడలో చైన్ లాగగా కింద పడిపోయింది. కొద్ది నిమిషాల వ్యవధిలోనే నిందితులు కార్వి కార్యాలయం ముందు కల్పన లత అనే యువతి మెడలోని తులం బంగారు గొలుసు లాక్కొని పారిపోతూ ట్రిపుల్ ఐటీ జంక్షన్‌లో పట్టుబడ్డారు. కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లో ఈనెల 3న ఓ మహిళ మెడలో రెండు తులాల గొలుసు, 6న ప్రగతినగర్‌లో మహిళ మెడలోని అర తులం గొలుసు స్నాచింగ్స్ అయ్యాయని డీసీపీ చెప్పారు. ఈ రెండూ స్నాచింగ్‌లు నాగబాబు, షాన్ హుస్సేన్‌లు చేసినట్టు సీసీ కెమెరాల ఫుటేజీల ద్వారా గుర్తించామన్నారు. నిందితుల నుంచి 3.5 తులాల మూడు గొలుసులు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో మాదాపూర్ ఏసీపీ రమణకుమార్, సీఐ జె.రమేశ్ కుమార్, డీఐ న ర్సింహ్మారావు, ఎస్‌ఐ లాల్ మధార్ పాల్గొన్నారు.
కెమెరాలతో స్నాచింగ్స్ తగ్గాయి
ఐటీ కారిడార్‌లో 150 సీపీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో నేరాలను వెంటనే ఛేదించేందుకు దోహదపడుతున్నాయని మాదాపూర్ డీసీపీ కార్తికేయ తెలిపారు. మాదాపూర్ జోన్‌లోని ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో 2014లో 215 స్నాచింగ్‌లు జరగగా, 2014లో 161, 2015లో 65 జరిగాయన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 15 స్నాచింగ్‌లు జరిగాయని, సీసీ కెమెరాలు ఉండటంతో పాటు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం, దొంగలను ప్రతిఘటించడం వంటివి చేస్తుండటంతో స్నాచింగ్‌లు తగ్గుముఖం పట్టాయన్నారు.
స్నాచింగ్‌పై స్పందించిన వారికి ప్రశంసా పత్రాలు..
వరుస స్నాచింగ్‌లు జరిగాయని సమాచారం అందడంతో కమాండ్ కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎండీ పాషా ఐటీ కారిడార్‌లోని సీసీ ఫుటేజీలను పరిశీలించి నిందితులు ఎటువైపు వెళ్తున్నారో ఎప్పటికప్పుడు సమాచారం అందించారు. ఆ సమయంలో గౌలిదొడ్డి రోడ్డుపై కానిస్టేబుళ్లు రాంమోహన్ రెడ్డి, మహిపాల్ వాహన తనిఖీలు చేపట్టారు. దీంతో స్నాచర్లు ఎటూ వెళ్లలేక ట్రిపుల్ ఐటీ వైపు వెళ్లారు. అక్కడ రాధ (పేరు మార్చాం) అనే మహిళ మెడలోని చైన్ లాగేందుకు యత్నించగా ప్రతిఘడించి కేకలు వేసింది. దీంతో కార్వి మార్గంలో కారులో వస్తున్న నర్సింహ్మారెడ్డి అనే వ్యక్తి స్నాచర్లను వెంబడించి ట్రిపుల్ ఐటీ జంక్షన్‌లో పట్టుకోగా.. అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ హోంగార్డు రవికుమార్ వెంటనే స్పందించి నిందితులను అదుపులోకి తీసుకున్నాడు. కాగా, వీరిందరినీ సైబరాబాద్ కమిషనర్ సీపీ ఆనంద్ సన్మానించి ప్రశంసా పత్రాలు అందించారు.