2,340 డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి కసరత్తు
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన కళాశాల విద్యా శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 2,340 లెక్చరర్ పోస్టుల భర్తీకి కళాశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. దీంతోపాటు కొత్త పోస్టుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. అలాగే... ఆన్‌లైన్ పేపర్ వాల్యుయేషన్ విధానం తీసుకురావాలని భావిస్తోంది. ప్రస్తుతం డిగ్రీ కాలేజీల్లో మంజూరైన 2,761 పోస్టుల్లో 1,105 ఖాళీగా ఉన్నాయి. ఇవిగాక కొత్త డిగ్రీ కాలేజీలకు 1,235 లెక్చరర్లు అవసరమంటూ ప్రతిపాదనలు పంపించింది.
చాయిస్ బేస్డ్ క్రెడిటస్ సిస్టమ్‌లో సెమిస్టర్ విధానం అమలు చేస్తున్నందున ప్రతి 90 రోజులకు ఒకసారి పరీక్షలుంటాయి. కాబట్టి పక్కాగా విద్యా బోధన అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పోస్టులు మంజూరు చేయాలని శాఖ కోరింది. మరోవైపు 802 కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్‌పైనా కసరత్తు చేస్తోంది. దీంతోపాటు 400 మంది జూనియర్ లెక్చరర్లకు డిగ్రీ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించడం ద్వారా పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇవిపోగా మిగిలిన పోస్టులను డెరైక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా (25 శాతమే) భర్తీ చేసే ఆలోచనలు చేస్తోంది.
ఆన్‌లైన్‌లో మూల్యాంకనం...
రాష్ట్రంలో డిగ్రీ పరీక్షల మూల్యాంకనంలో సమూల సంస్కరణలు తీసుకువచ్చేందుకు కళాశాల విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్ పేపర్ వాల్యుయేషన్ విధానం తీసుకురావాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న విధానంలో కొంతమంది అధ్యాపకులు సరిగ్గా పేపర్లు దిద్దడం లేదన్న విమర్శలున్నాయి. డిస్క్రి ప్టివ్ పరీక్షలు కావడంతో ఒక్కో లెక్చరర్ ఒక్కో విధంగా మార్కులు వేస్తున్నారు. పైగా కాంట్రాక్టు లెక్చరర్లు కొంతమందికి సబ్జెక్టుపై పూర్తి అవగాహన లేకపోవడం, కొన్ని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు సీనియర్ లెక్చరర్లను వాల్యుయేషన్‌కు పంపించకపోవడం వంటి కారణాల వల్ల మార్కుల విధానంలో తేడాలు వస్తున్నట్లు శాఖ గుర్తించింది.
ఈ క్రమంలో ఇలాంటి సమస్యలకు ఆన్‌లైన్ విధానంతోనే చెక్ పెట్టవచ్చన్న నిర్ణయానికి వచ్చినట్లు కళాశాల విద్య కమిషనర్ వాణిప్రసాద్ పేర్కొన్నారు. ఈ విధానంలో విద్యార్థుల జవాబు పత్రాలను స్కాన్ చేసి ఒకే స్థాయి కెపాసిటీ కలిగిన సీనియర్ లెక్చరర్లకు మాత్రమే పేపర్లను పంపించి ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేయించాలని భావిస్తున్నారు. తద్వారా మూల్యాంకనం కోసం వారు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆన్‌లైన్‌లో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ సహాయంతో తనకు పంపించిన జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి, మార్కుల వివరాలను అప్‌లోడ్ చేసే వీలుంటుంది. కర్ణాటకలో అమలు చేస్తున్న ఈ విధానంపై త్వరలోనే అధ్యయనం చేసేందుకు శాఖ చర్యలు చేపడుతోంది. ఆన్‌లైన్ వాల్యుయేషన్ విధానాన్ని మొదటిగా అమలు చేసేందుకు మహాత్మాగాంధీ యూనివర్సిటీ ముందుకు వచ్చింది.