2,964 మంది రైతుల ఆత్మహత్య | 2,964 farmer suicide | Sakshi
Sakshi News home page

2,964 మంది రైతుల ఆత్మహత్య

Published Thu, Jun 8 2017 2:58 AM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM

2,964 మంది రైతుల ఆత్మహత్య - Sakshi

2,964 మంది రైతుల ఆత్మహత్య

- టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ 
- సీఎం ఇలాఖాలోనే 112 మంది రైతుల బలవన్మరణాలు
 
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2,964 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత నియోజకవర్గంలోనే 112 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పార్టీ నేతలు టి.జీవన్‌రెడ్డి, మల్లు రవితో కలసి బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో మూడేళ్లలో 2,964 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే వారిలో మూడో వంతు కుటుంబాలను కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆదుకోలేదని ఆరోపించారు.

లక్ష రూపాయల రుణాన్ని మాఫీ చేసినట్టుగా సీఎం కేసీఆర్‌ చెబుతున్నారని, రుణమాఫీ అయితే బ్యాం కులు రైతులకు పాసు పుస్తకాలను ఎందుకు ఇవ్వడంలేదో టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పాలని నిలదీశారు. రుణాలపై కేవలం వడ్డీ మాత్రమే మాఫీ అయిందని, కొత్త రుణాలు రైతులకు అందడంలేదని అన్నారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదని, నకిలీ విత్తన కంపెనీలపై చర్యల్లేవని ఉత్తమ్‌ విమర్శించారు. ఫసల్‌ బీమా యోజన కింద రైతులు 2016 ఖరీఫ్‌లో బీమా కంపెనీలకు రూ.17 వేల కోట్లు చెల్లిస్తే, రైతులకు కేవలం రూ.6,800 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. దీనివల్ల బీమా కంపెనీలకే లాభం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అ«ధికారంలోకి వస్తుందని, రైతులకు రెండు లక్షల రూపాయలదాకా పంట రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామని, వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తామని ఆయన ప్రకటించారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఏడాది నుంచే రైతులకు ఎకరానికి రూ.4వేలు పంటసాయాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మద్దతు ధర కోసం నిరసన చేస్తున్న రైతులను మధ్యప్రదేశ్‌లో పోలీసులు కాల్చి చంపడం దారుణమని అన్నారు. కేంద్రంలో ప్ర«ధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత లక్షన్నరకోట్లు కార్పొరేటు రుణమాఫీ చేసిందని, రైతులకు మద్దతు ధర ఎందుకు ఇవ్వడంలేదని ఉత్తమ్‌ ప్రశ్నించారు. మియాపూర్‌ భూముల కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఈ కుంభకోణంలో ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement