మైనారిటీలకు 60 కొత్త స్కూళ్లు | 60 schools to minoritys: kcr | Sakshi
Sakshi News home page

మైనారిటీలకు 60 కొత్త స్కూళ్లు

Published Wed, Dec 30 2015 1:50 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

60 schools to minoritys: kcr

 ► జూన్ నుంచి ప్రారంభించాలని సీఎం ఆదేశం
►తొలుత 5, 6, 7 తరగతుల్లో ప్రవేశాలు
►క్రమంగా 12వ తరగతి వరకు స్థాయి పెంపు
►ఇంగ్లిష్‌లో విద్యాబోధన.. పోస్టుల భర్తీకి
► డీఎస్సీతో పాటు నోటిఫికేషన్
►నిర్వహణ బాధ్యతలు విద్యాశాఖకు అప్పగింత
►అధికారులతో సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి కేసీఆర్
► చంచల్‌గూడ జైలు, రేస్‌కోర్స్‌లను తరలించాలని సూచన


 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం (2016 జూన్) నుంచి  60 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వీటిలో 30 పాఠశాలలు బాలికలకు, మరో 30 బాలురకు కేటాయించాలన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ నిధుల ద్వారా నడిచే ఈ పాఠశాలల నిర్వహణ బాధ్యతను విద్యాశాఖ స్వీకరించాలని సూచించారు. ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన జరగాలని, మొదటి ఏడాది 5, 6, 7 తరగతులలో ప్రవేశాలు కల్పించి.. ప్రతి ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ 12వ తరగతి వరకు ఈ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యాబోధన జరపాలని సీఎం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే జూన్‌లో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభం కావాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, మైనారిటీ సంక్షేమం, విద్యాశాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ పాఠశాలలకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందిని నియమించే చర్యలు చేపట్టాలన్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా డీఎస్సీ నోటిఫికేషన్‌తో పాటే రావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మొదటి ఏడాది కిరాయి భవనాల్లో పాఠశాలలు నడపాలని 2017 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త భవనాలు నిర్మించాలని ఆదేశించారు. మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించాలని, అందుకోసం అనువైన స్థలాలను గుర్తించాలని చెప్పారు. వక్ఫ్ బోర్డు స్థలాలను వినియోగించుకోవచ్చన్నారు. ఒక్కో భవనాన్ని రూ.20 కోట్లతో కనీసం ఆరెకరాల విస్తీర్ణంలో నిర్మిస్తామని అన్నారు. ఈ బడ్జెట్‌లోనే రెసిడెన్షియల్ పాఠశాలలకు నిధులు కేటాయిస్తామన్నారు.

మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నందున కార్యక్రమాలు వేగంగా అమలయ్యేందుకు అవసరమైన సిబ్బందిని కూడా నియమించాలని చెప్పారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేస్తే వెంటనే ఖాళీలు భర్తీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. మైనారిటీ సంక్షేమంపై ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ షఫీ ఉల్లా, మైనారిటీ సంక్షేమ శాఖ డెరైక్టర్ అక్బర్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
 చంచల్‌గూడ జైలు, రేస్ కోర్స్ తరలింపు

 హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలును చర్లపల్లికి తరలించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. రేస్ కోర్‌్రను కూడా నగర శివార్లకు తరలించాలన్నారు. ఈ రెండు స్థలాలను రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి ఉపయోగించాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement