73 మండలాల్లో వర్షాభావం
175 మండలాల్లో అధిక, 208 మండలాల్లో సాధారణ వర్షపాతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒకవైపు విరివిగా వర్షాలు కురుస్తున్నా... అవి అన్ని మండలాలనూ తాకడంలేదు. ఇంకా 73 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం (టీఎస్‌డీపీఎస్) శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యా యి. ఈ ఏడాది జూన్, జులై నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 16 శాతం అధిక వర్షపాతం నమోదైంది. జూన్‌లో 50 శాతం అధికం కాగా... జులైలో 3 శాతం లోటు రికార్డైంది. మూడు జిల్లాల్లో అధికం నమోదైంది. వాటిల్లో ఆదిలాబాద్ జిల్లాలో 36 శాతం, వరంగల్ 23శాతం,ఖమ్మం జిల్లాలో 20 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతమే. మొత్తం 459 మండలాలకు గాను 208 మండలాల్లో సాధారణ, 175 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. 73 మండలాల్లో వర్షాభావం నెలకొంది. అందులో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో 17 మండలాల వంతున వర్షాభావంలో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 11, మెదక్‌లో 10, హైదరాబాద్‌లో 3, కరీంనగర్‌లో 8, ఖమ్మంలో 4, వరంగల్‌లో రెండు, నిజామాబాద్‌లో ఒక మండలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మూడు మండలాలు తీవ్ర కరువు పరిస్థితుల్లో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా వంగూరులో 72 శాతం లోటు నమోదైంది. అలాగే నల్లగొండ జిల్లా మర్రిగూడలో 68 శాతం, చందంపేటలో 66 శాతం లోటు వర్షపాతం నమోదైంది.