టెక్స్‌టైల్ రంగానికి భారీ ప్రోత్సాహం
వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పిస్తున్న టెక్స్‌టైల్ రంగాన్ని ప్రోత్సహించడానికి జాతీయ స్థాయిలో సమగ్ర విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర పరిశ్రమలు
- అత్యుత్తమ విధానం, పారదర్శకత మా బలం: కేటీఆర్
- టెక్స్‌టైల్ ఇండియా సమ్మిట్‌లో మంత్రి ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పిస్తున్న టెక్స్‌టైల్ రంగాన్ని ప్రోత్సహించడానికి జాతీయ స్థాయిలో సమగ్ర విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి కె.తారకరామారావు సూచించారు. గుజరాత్‌లోని గాంధీనగర్, మహాత్మానగర్‌లో శుక్రవారం జరిగిన టెక్స్‌టైల్ ఇండియా సమ్మిట్‌లో కేటీఆర్ పాల్గొన్నారు. సదస్సులో భాగంగా జరిగిన సీఈవో రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక పాలసీని మంత్రి వివరించారు. ప్రాధాన్య రంగంగా టెక్స్‌టైల్ పరిశ్రమను ప్రభుత్వం గుర్తించిందని, వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్ పార్కును నిర్మిస్తోందని చెప్పారు. పారిశ్రామిక విధానం వల్ల పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందన్నారు.
త్వరలో టెక్స్‌టైల్ పాలసీ..
త్వరలోనే టెక్స్‌టైల్ పాలసీని తెస్తామని కేటీఆర్ చెప్పారు. పారిశ్రామిక విధానంలానే ఈ పాలసీ కూడా విప్లవాత్మకంగా ఉంటుందని పేర్కొన్నారు. టెక్స్‌టైల్ రంగంలో పెట్టుబ డులు పెట్టాలంటూ పెట్టుబడిదారులను ఆహ్వానించారు. ఫైబర్ టు ఫ్యాషన్ పద్ధతిలో ముడి సరుకు నుంచి తుది ఉత్పత్తి దాకా అన్నీ ఈ పార్కులోనే జరుగుతాయని చెప్పారు. దేశీయ అవసరాల నుంచి అంతర్జాతీయ ఫ్యాషన్ వరకు కావాల్సిన అన్ని ఉత్పత్తులు ఈ పార్కు నుంచి వచ్చేలా చూస్తామన్నారు. కార్మికులకు అక్కడే నివాసాలు ఏర్పాటు చేసున్నామని పేర్కొన్నారు. వారిలో వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు కోయంబత్తూర్‌లోని పీఎస్‌జీ సంస్థతో కలసి ఓ సంస్థను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ వివరించారు.
ఈ పరిశ్రమ విస్తృతికి తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని, ఇక్కడి పత్తి మంచి నాణ్యతతో ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పారదర్శకత, మౌలిక వసతులు, సరుకు రవాణా పరంగా దేశానికి కేంద్రస్థానంలో ఉండటం వంటికి తెలంగాణలో పెట్టుబడులకు సానుకూల అంశాలన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పారిశ్రా మిక వేత్తలకు ప్రపంచంలో ఎవరైనా ఇచ్చే ప్యాకేజీ, ప్రోత్సాహకాలకు సరితూగేటట్లు లేదా అంతకుమించి ఇస్తామని కేటీఆర్ హామీనిచ్చారు.