దేవుళ్లకే పంగనామాలు | a thief robbery only temples | Sakshi
Sakshi News home page

దేవుళ్లకే పంగనామాలు

Published Sat, Feb 25 2017 3:43 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

a thief robbery only temples

వేలల్లో దక్షిణ ఇస్తాడు..
దేవుడి నగలు దోచుకెళతాడు
42 ఆలయాల్లో చోరీలకు 
పాల్పడిన గజదొంగ అరెస్టు
 
మారేడుపల్లి: రద్దీ లేని ఆలయాలను టార్గెట్‌ చేసుకుని పూజారుల దృష్టి మరల్చి దేవుడి నగలను దోచుకెళుతున్న గజదొంగను మారేడుపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి రూ.1.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నార్త్‌ జోన్‌ కార్యాలయంలో డీసీపీ సుమతి కేసు వివరాలు వెల్లడించారు. కాకినాడకు చెందిన ఎమని రాంబాబు 29 ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చాడు. వివిధ ప్రాంతాల్లో ఉంటూ ఆలయాల్లో దేవుడి నగలు దొంగిలించేవాడు. 2009లో కూకట్‌పల్లి పోలీసులు 11 ఆలయాల్లో జరిగిన చోరీల్లో నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 2012లో నాంపల్లి పోలీసులు, 2015లో జూబ్లీహిల్స్‌ పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై పీడీ యాక్టు నమోదు  చేశారు. ఇటీవల జైలు నుంచి బయటికి వచ్చిన రాంబాబు కొత్త పేట్‌ మారుతీనగర్‌లో నివాసం ఉంటూ మారేడుపల్లి ఉజ్జయిని మహంకాళి ఆలయం, బోయిన్‌పల్లి, చిలకలగూడా, సుల్తాన్‌ బజార్, అసిఫ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పలు దేవాలయాల్లో పూజారుల దృష్టి మళ్లించి దేవుడి నగలు ఎత్తుకెళ్లాడు.
ఒంటినిండా బంగారం..
భారీగా దక్షిణ
నిందితుడు రాంబాబు ఒంటినిండా నకిలీ బంగారం ధరించి సంపన్నుడిలా ప్రజలను నమ్మించేవాడు. కేవలం ఆలయాలను మాత్రమే టార్గెట్‌ చేసుకునే ఇతను సీసీ కెమెరాలు లేని చిన్న ఆలయాలను ఎంచుకుంటాడు. సంపన్నుడిలా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజ చేయించుకున్న తరువాత పూజారికి భారీగా దక్షిణ సమర్పిస్తాడు. చిల్లర తెచ్చేందుకు పూజరి లోపలికి వెళ్ళగానే దేవుడి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు  తీసుకుని పరారయ్యేవాడు. మారేడుపల్లి ఆలయ ప్రంగణంలోని సీసీ కెమెరా పుటేజీని పరిశీలించిన పోలీసులు.. నిందితుడు రెడ్‌ కలర్‌ పల్సర్‌ బైక్‌ పై వచ్చి దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. జూబ్లీ బస్టాండ్‌ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన అతడిని  అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడు ఇప్పటి వరకు 43 ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు డీసీపీ తెలిపారు. నిందితుడితో పాటు బంగారాన్ని కొనుగోలు చేసిన అమిత్‌ అనే వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు.  సమావేశంలో మహంకాళి ఏసీపీ గంగాధర్‌ మారేడుపల్లి సీఐ ఉమామహేశ్వర్‌ రావు, డీఐ అప్పలనాయుడు, ఎస్సై అరవింద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement