బంద్ ప్రశాంతం
* సీఎం కేసీఆర్ తీరుపై నిరసన
* హోరెత్తిన నినాదాలు
* సుమారు 5వేల మంది అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: రైతు సమస్యల పరిష్కారం కోరుతూ కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, వైఎస్‌ఆర్ సీపీ, వామపక్షాలు, వివిధప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం నగరంలో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. పోలీసుల సాయంతో ఆర్టీసీ బస్సులు నడిచాయి.
షాపులు, వ్యాపార కేంద్రాలు, పెట్రోల్ బంకులు ఉదయం కొంతసేపు మూసివేశారు. ఆ తరువాత యధావిధిగా తెరచుకున్నాయి. ఒకటి, రెండు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. ఉదయం నుంచే బస్ డిపోలు, బస్ స్టేషన్‌లకు చేరుకున్న విపక్షాల నేతలు సీఎం కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిర సన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్లు, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ముషీరాబాద్, తదితర ప్రాంతాలు నినాదాలతో హోరెత్తాయి.
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో విరసం నేత వరవరరావు, సీపీఎం కార్యదర్శి తమ్మినేని, అరుణోదయ విమల, పీవోడబ్ల్యూ నేత సంధ్య, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పలుమార్లు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జేబీస్, ఎంజీబీఎస్‌లలో అఖిలపక్ష నాయకుల అరెస్టుల పర్వం కొనసాగింది. సుమారు 5వేల మంది నేతలు, కార్యకర్తలు అరెస్టయ్యారు.
80 శాతం తిరిగిన బస్సులు..
ఉదయం ఒకటి, రెండు గంటల అంతరాయం మినహా నగరంలోని అన్ని డిపోల నుంచి శనివారం 80 శాతం వరకు బస్సులు రోడ్డెక్కినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అవసరమైన చోట పోలీసుల సాయంతో నడిపినట్లు పేర్కొన్నారు. వివిధ చోట్ల ఆందోళనకారులు 4 బస్సుల అద్దాలు పగులగొట్టారు. ఆటోలు యధావిధిగా నడిచాయి.