స్పోర్ట్స్‌ కోటాపై ఏసీబీ విచారణ | ACB inquiry on mbbs sports quota Seat replacement | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్‌ కోటాపై ఏసీబీ విచారణ

Published Fri, May 18 2018 3:53 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB inquiry on mbbs sports quota Seat replacement - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌ స్పోర్ట్స్‌ కోటా సీట్ల భర్తీలో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని సీఎం కేసీఆర్‌ గురువారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)ని ఆదేశించారు. అక్రమాలకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఎంబీబీఎస్‌ సీట్లకు డిమాండ్‌ దృష్ట్యా ఏ, బీ కేటగిరీ సీట్లు దక్కని పరిస్థితులో సీ కేటగిరీ సీట్లు పొందేందుకు కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ‘సీ’కేటగిరీ(ఎన్‌ఆర్‌ఐ)లో సీటు వచ్చిన విద్యార్థి కోర్సు పూర్తి చేసేందుకు కోటి రూపాయలకుపైగా ఖర్చు చేయా ల్సి ఉంటోంది.

‘బి’కేటగిరీలో సీటు వస్తే ఏడాదికి రూ.11.50 లక్షల వరకు ఫీజు చెల్లించాలి. స్పోర్ట్స్‌ కోటాలో సీటు తెచ్చుకుంటే ప్రైవేటు కాలేజీల్లో ఏటా రూ.60 వేలు, ప్రభుత్వ వైద్య కళాశాలలో అయితే ఏడాదికి రూ.10 వేలు చెల్లిస్తే సరిపోతుంది. మెరిట్‌ ప్రాతిపదికన సీట్లు రాని అభ్యర్థులు అధికారుల సహకారంతో స్పోర్ట్స్‌ కోటాలో సీట్లు సంపాదిస్తున్నారు. కొన్నేళ్ల నుంచి ఈ వ్యవహారం జరుగుతోంది.  వైద్య కోర్సులో క్రీడాకారులకు సీట్లు కేటాయించాలని 2008లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విధానం తెలంగాణలోనూ కొనసాగుతోంది. దీని ప్రకారం, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆడిన వారి కంటే అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలి.

ఒకే సీటుకు ముగ్గురు క్రీడాకారులు పోటీ పడితే అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు వరుసగా అవకాశం ఇవ్వాలి. వ్యక్తిగతంగా పాల్గొన్నా, జట్టు పరం గా పాల్గొన్నా ఇదే ప్రాధాన్యత ఉంటుంది. స్పోర్ట్స్‌ కోటా వైద్య సీటు పొందాలనుకునే విద్యార్థి ముందుగా స్పోర్ట్స్‌ అథారిటీకి దరఖాస్తు చేసుకోవాలి. ఏ ఆటలో, ఏ స్థాయిలో పాల్గొన్నారనే విషయాలను ధ్రువీకరిస్తూ సంబంధిత పత్రాలను జత చేయా లి. వీటిని పరిశీలించాక స్పోర్ట్స్‌ అథారిటీలోని ప్రత్యేక కమిటీ అర్హుల జాబితాను సిద్ధం చేస్తుంది. ప్రతిభ ఆధారంగా కాకుండా పైరవీలోనే ఈ జాబితా తయారవుతోందనే ఆరోపణలు పెరుగుతున్నాయి.

2010 నుంచి 2016 వరకు ఎంబీబీఎస్‌ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియలో అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్నవారికి ప్రాధాన్యత ఇచ్చారు. 2017లో అంతర్జాతీయ స్థాయి లో పాల్గొన్న క్రీడాకారుడిని పక్కనబెట్టి, జాతీయ స్థాయి లో ఆడిన అభ్యర్థికి సీటు ఇచ్చేలా చేశారు. దీంతో అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని, చదువుల్లో ప్రతిభ చూపిన అభ్యర్థి సీటు కోల్పోయారు. దీనిపై సీటు దక్కని అభ్యర్థి తండ్రి స్పోర్ట్స్‌ అథారిటీ అధికారులను కలిసి వివరించారు.

అధికారులు పట్టించుకోకపోవడంతో విజిలెన్స్‌ విభాగానికి ఫిర్యా దు చేశారు. తొలి జాబితాలో తన కుమారుడి పేరు ఉందని, తర్వాత దాన్ని మార్చారని పేర్కొంటూ వివరాలను అందజేశారు. అయినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. రూ. 50 లక్షలు ఇస్తే సీటు వచ్చేలా చేస్తామని స్పోర్ట్స్‌ అథారిటీ అధికారులు చెప్పారన్నారు. దీనిపై స్పందించిన  రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement