ఈ నగరానికి ఏమైంది..?
కల్తీ క‘మాల్’
ఆరోగ్యం ఢమాల్
సిటీపై కల్తీ కేటుగాళ్ల పంజా
►జోరుగా ఆహారపదార్థాల కల్తీ.. గ్రేటర్ వాసుల్లో ఆందోళన
►నూనె, పాలు, తేనె, బియ్యం, మసాలాలు... దేన్నీ వదలని వైనం
► తొలుత నిత్యావసరాల వ్యాపారం..ఆపై కల్తీ వైపు పయనం
►ఉత్తరాది రాష్ట్రాల నుంచి కల్తీ ముడిసరుకుల దిగుమతి
► ప్రమాదకర పదార్థాలతో ఆరోగ్యానికి తీవ్ర హాని
►తనిఖీలు..పర్యవేక్షణ లేకే పరిస్థితి తీవ్రం
►కోటి మంది జనాభాకు ఇద్దరే ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు
►ధనదాహంతో విచ్చలవిడిగా కల్తీ చేస్తున్న వ్యాపారులు
► తాజాగా కలకలం రేపుతున్న ప్లాస్టిక్ బియ్యం
►మాఫియాగా సాగుతున్న వ్యవహారంపై పోలీసు నజర్
► అమలుకు నోచని ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్’ చట్టం
సిటీలో ‘కల్తీ’ రాజ్యం నడుస్తోంది. కాలుష్యంతో గాలి..నీరు కలుషితమవుతుండగా..వ్యాపారుల ధనదాహంతో తినే ఆహారమూ కల్తీమయం అవుతోంది. ఆరోగ్యం హరిస్తోంది. నిత్యావసరాలైన వంట నూనెలు, బియ్యం, టీ పొడి నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసుల వంటి ముఖ్యమైన పదార్థాలను పూర్తిగా నకిలీవి సృష్టిస్తున్నారు. ప్రమాదకర..విషపూరిత రసాయనాలు కలిపి అసలు ఏవో.. నకిలీ ఏవో తెలియకుండా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆహార తనిఖీలు, పర్యవేక్షణ చేపట్టి కల్తీకి అడ్డుకట్ట వేయాల్సిన ఫుడ్ సేఫ్టీ విభాగం నిర్వీర్యంగా మారింది. ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్’ చట్టం అమలుకు నోచడం లేదు. కోటి జనాభా కలిగిన నగరంలో ఇద్దరే ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
సిటీబ్యూరో: సిటీలో ఆహార కల్తీ దందా మాఫియాగా సాగుతోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దీన్ని సీరియస్‌గా తీసుకున్న టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఓటీ, జోనల్ పోలీసులు వరుస దాడులు చేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కల్తీ పాలు, తేనె, అల్లంపేస్ట్ తదితరాలను పట్టుకోగా... బుధవారం రాచకొండ ఎస్‌ఓటీ అధికారులు నకిలీ సాస్ దందాను గుట్టురట్టు చేశారు.
వ్యాపారులే దారితప్పి...
ఈ కల్తీ దందాలో చిక్కుతున్న వారిలో అత్యధికం వ్యాపారులే ఉంటున్నారు. తొలుత ఏదో ఒక నిత్యావసర సరుకులు, పప్పుదినుసుల వ్యాపారాన్ని ప్రారంభించి పక్కాగానే చేస్తున్నారు.
ఉత్తరాది నుంచి ముడిసరుకులు...
ఈ నకిలీ ఆహారపదార్థాలు తయారు చేయడానికి కావాల్సిన ముడిసరుకును ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్, ముంబై, ఢిల్లీల నుంచి ఖరీదు చేస్తున్నారు. వీటన్నింటినీ ఎలాంటి బిల్లులు లేకుండా కొన్ని ట్రాన్స్‌పోర్టు కంపెనీల ద్వారా కిలోకు రూ.5 చొప్పున అదనంగా చెల్లిస్తూ రప్పిస్తున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చే ముడిసరుకుకు కిలోకు రూ.6 చొప్పున అదనంగా చెల్లిస్తున్నారు. రాయిపూర్, ఉత్తర్‌ప్రదేశ్‌ల నుంచి ఎగుమతి, దిగుమతుల్ని బిల్లులు లేకుండా నిర్వహించే అనేక ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలు సిటీలో ఉన్నాయి. ఇంతటి హేయమైన దందాలు నిర్వహిస్తున్న వీరిపై కఠినం చర్యలు తీసుకోవడానికి అసవరమైన చట్టాలు మాత్రం లేవని చెప్తున్నారు. వీరిపై దాడులు చేసేది పోలీసులైతే... చర్యలు తీసుకోవాల్సింది మాత్రం ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు. ఈ తరహా నేరాలు చేసే వారికి అరెస్టు చేసే అవకాశం లేదు. కేవలం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ యాక్ట్–2006 కింద కేసు నమోదు చేస్తారు.
నకిలీ సరుకుల తయారీ ఇలా...
మిరియాలు: ఐదు కేజీల సింథటిక్ గమ్, 10 కేజీల మైదా, 3 గ్రాముల రెడ్ ఆక్సైడ్, 5 గ్రాముల ఆర్టిఫీషియల్ రెడ్ ఆక్సైడ్‌లను 15 లీటర్ల నీటిలో కలుపుతారు. ఈ ద్రావణాన్ని 20 కేజీల బొప్పాయి విత్తనాల్లో (నల్లగా ఉండే భాగం) వేసి కలపడం ద్వారా మిరియాలు తయారు చేస్తున్నారు. మూడో రకం క్వాలిటీ నల్ల మిరియాలను ఫస్ట్ క్వాలిటీగా మార్చడానికి ఇలాంటి ద్రావణాన్నే వినియోగిస్తున్నారు.
గసగసాలు: ఐదు కేజీల రాళ్ల పొడి, 30 కేజీల మైదా, 5 గ్రాముల పెయింట్స్ వైటనర్, 30 కేజీల గ్లూకోజ్, 2 కేజీల లిక్విడ్ జాంగ్రీలను 10 లీటర్ల నీటిలో కలిపి ద్రావణం సిద్ధం చేస్తారు. దీన్ని 60 కేజీల బొంబాయి రవ్వలో కలపడం ద్వారా 115 కిలోల గసగసాలను తయారు చేస్తున్నారు. ఫైన్‌క్వాలిటీ కోసం నాసిరకం వాటికి సోడియం హైడ్రోసల్ఫేట్ ఒక కేజీ, పెయింట్స్ వైటనర్ 5 లీటర్ల నీటిలో కలిపి 50 కేజీలు తయారు చేస్తున్నాడు.
జీలకర్ర: ఒక కేజీ సోడియం హైడ్రోసల్పేట్, 25 కేజీల కార్వే స్వీట్స్, పెయింట్స్ వైటనర్‌ను వినియోగించి జీలకర్రను తయారు చేస్తున్నారు. చిన్న చిన్న గడ్డి పొరకలు, బొంబాయి చీపురు కట్టల నుంచి రాలిన ముక్కలపై రసాయినాలు జోడించి దీన్ని సిద్ధం చేస్తున్నారు.
శొంఠి: పనికిరాని అల్లాన్ని సేకరిస్తున్న నకిలీ రాయుళ్ళు దాన్ని పూర్తిగా ఆరబెడుతున్నారు. ఆ తర్వాత కాంక్రీట్ మిక్సింగ్ చేసే మాదిరి చిన్నపాటి యంత్రంలో దీన్ని వేస్తున్నారు. దీంతోపాటు సున్నం, ఫెవికాల్, నీలం కలిపి మిక్సింగ్ చేసి ఆరబెట్టడం ద్వారా నకిలీ శొంఠి తయారు చేస్తున్నారు.
నూనె: కల్తీ సరుకుల తయారీలో నూనెది అత్యంత దారుణమైన విధానం. జంతు వ్యర్థాలతో నూనె తయారు చేస్తున్న అనేక యూనిట్లను పోలీసులు గుర్తించి చర్యలు తీసుకున్నారు. వివిధ రకాలైన జంతువుల ఎముకల్ని సేకరిస్తున్న దుండగులు వాటిని నిర్ణీత పద్ధతిలో వేడి చేయడం ద్వారా నూనె ఉత్పత్తి చేస్తున్నారు.
అల్లం వెల్లుల్లి పేస్ట్: కుళ్లిన బంగాళ దుంపలు, అరటి బోదెలు, రసాయనాలు కలిపి అల్లం వెల్లుల్ల పేస్ట్ సిద్ధం చేసేస్తున్నారు. వాసన కోసం మాత్రం అతి తక్కువ పాళ్ళల్లో అల్లం, వెల్లుల్లి వాడుతున్నారు.
వనస్పతిని వినియోగించి నెయ్యి, కలర్ కోటింగ్‌తో నాసిరకం సోంపు, గడువు చెల్లిన చాక్లెట్లను రీ–సైకిల్ చేయడం ద్వారా కొత్తవి, గ్లూకోజ్ వాటర్–చెక్కెర పాకంతో తేనె, బోరు నీటితో మినరల్ వాటర్ తయారు చేయడంలోనూ అనేక మంది సిద్ధహస్తులున్నారు.
రసాయన పాలు: బోయిన్‌పల్లి, బేగంబజార్ తదితర ప్రాంతాల నుంచి పాలపొడి, హైడ్రోజన్ పెరాక్సైడ్ రసాయనాన్ని కొనుగోలు చేస్తున్నారు. పది లీటర్ల పాలు తయారు చేయడానికి కేజీ పాలపొడి, తొమ్మిది లీటర్ల నీరు, లీటరు అసలు పాలతో పాటు 15 మిల్లీ లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ వినియోగిస్తున్నారు. ఈ రసాయనం పాలు చిక్కగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అధిక పాల దిగుబడి కోసం నిషేధిత ఇంజక్షన్లు, టానిక్స్ వాడకమూ ఉంది.
పాల కల్తీలో మరో తంతు... కొన్ని ముఠాలు వివిధ ప్రాంతాల నుంచి ఖాళీ పాల ప్యాకెట్లు సేకరిస్తున్నాయి. రోజూ తెల్లవారుజామునే కంపెనీల నుంచి డీలర్ల వద్దకు పాల ప్యాకెట్లు వస్తాయి. వాటిని సేకరిస్తున్న దుండగులు తమ డెన్‌లకు తీసుకువెళ్తున్నారు. అక్కడ ఆ ప్యాకెట్లను కత్తిరించి, వాటిలో ఉన్న పాలను బకెట్లలో పోస్తారు. ఇలా తీసిన ప్రతి 50 లీటర్ల పాలలోనూ 15 లీటర్ల నీరు కలుపుతారు. ఒక్కోసారి కలుషిత నీటినీ కలుపుతున్నారు. అలా కల్తీ చేసిన పాలను తిరిగి అవే ప్యాకెట్లతో పాటు ముందే తెచ్చుకున్న ఖాళీ ప్యాకెట్లలోను నింపి ఎలక్ట్రానిక్ ప్యాకింగ్ మిషన్లతో సీల్ వేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం 45 నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఆపై ప్యాకెట్లను బట్వాడా చేస్తారు.
ఇద్దరు కల్తీరాయుళ్ళ ఆటకట్టు
సిటీబ్యూరో: రసాయనాలతో గోవా పేథా స్వీట్, నాసిరకం, గడువు ముగిసిన పదార్థాలతో ఐస్‌క్రీమ్స్ తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. జియాగూడ ప్రాంతానికి చెందిన రామ్‌సింగ్ జుమ్మేరాత్ బజార్‌లో ఓ స్వీట్ల తయారీ యూనిట్ నిర్వహిస్తున్నాడు. సున్నం, పటక, సోడియం హైడ్రో సల్ఫేట్, కృత్రిమ రసాయనాలను వినియోగిస్తూ గోవా పేథా అనే స్వీటు తయారు చేస్తున్నాడు. ముషీరాబాద్ బాపూజీనగర్‌కు చెందిన పి.అశోక్ ఐస్ క్రీమ్స్ తయారీ యూనిట్ నిర్వహిస్తున్నాడు. గడువు ముగిసిన, నాశిరకం పాలపొడి, రంగులు తదితరాలను వాడి వివిధ ఫ్లేవర్ల ఐస్‌క్రీమ్స్ తయారు చేస్తున్నాడు. వీటిలో కొన్ని నిషేధిత రసాయనాలను కలుపుతున్నాడు. ఈ రెండు యూనిట్లపై బుధవారం దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి భారీగా రసాయనాలు, నాసిరకమైన/నకిలీ ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు.