
సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో ఆందోళన చేస్తున్న బాధితులు
మెహిదీపట్నం: ఆపరేషన్ పేరుతో తమను అంధులుగా మార్చిన అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారని బాధితులు ఆరోపించారు. సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో గత నెల జరిగిన ఆపరేషన్లో చూపు కోల్పోయిన బాధితులు సోమవారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బాధితులు నూకాలతల్లి, మాణిక్యం, అంజిరెడ్డి, పీపీ మండల్, సత్యనారాయణ మాట్లాడుతూ డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా చూపుకోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సంఘటన జరిగి నాలుగు వారాలు గడిచినా కళ్లు కనపడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ప్రత్యేక శస్త్ర చికిత్సలు నిర్వహించ లేదని, కనీసం ఆర్థిక సహాయం చేయలేదన్నారు. డాక్టర్ల మాటపై నమ్మకం పోయిందని కనీసం అడుగు కూడా కదలలేక పోతున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై ఆసుపత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ రాజేందర్‌గుప్తాను వివర ణ కోరగా ప్రత్యేక శస్త్ర చికిత్సల కోసమే ఆసుపత్రికి పిలిపిస్తున్నట్లు తెలిపారు.