
రియల్ హీరో అక్కినేని: రోశయ్య
సాక్షి, సిటీబ్యూరో: అత్యంత ప్రజాభిమానం చూరగొన్న మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు రియల్ హీరో అని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య కొనియాడారు. మంగళవారం రవీంద్రభారతిలో కిన్నెర ఆర్ట్ థియేటర్స్, కిన్నెర కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కినేని 91వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ నాగేశ్వరరావు భౌతికంగా మన మధ్య లేకపోయినా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి మాట్లాడుతూ గొప్ప కారణజన్ముడు అక్కినేని అని తెలిపారు.
అక్కినేని- కిన్నెర పురస్కారాన్ని గవర్నర్ రోశయ్య చేతుల మీదుగా సాహితీ వేత్త, రచయిత డాక్టర్ ఓలేటి పార్వతీశానికి అందజేశారు. ఎస్‌వీ రామారావు రూపొందించిన ‘అక్కినేని జైత్రయాత్ర’ లఘు చిత్ర ప్రదర్శన, ప్రముఖ గాయకుడు ఆర్. సంపత్ బృందం నిర్వహించిన అక్కినేని చిత్ర సంగీత విభావరి అందర్నీ ఆకట్టుకుంది. రఘురామ్ రచించిన‘అక్కినేని అభిమానిగా..’ గ్రంథాన్ని గవర్నర్ రోశయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ సీఈవో డాక్టర్ పి. మధుసూదనరావు, సారిపల్లి కొండలరావు, సమత గోపాల్, సినీ విజ్ఞాన విశారద ఎస్‌వీ రామారావు, కిన్నెర సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఆర్. ప్రభాకరరావు, కార్యదర్శి మద్దాలి రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.