ఎన్నికల సంస్కరణలపై అఖిలపక్షం
సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం డిమాండ్
సాక్షి, హైద రాబాద్: దేశంలో ఎన్నికల సంస్కరణలు తీసుకురావడంపై ప్రధాని నరేంద్ర మోదీ నిజంగా పట్టుదలతో ఉంటే వెంటనే అఖిల పక్ష భేటీని ఏర్పాటు చేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి డిమాండ్ చేశారు. దీనికి సమాంతరంగా కేంద్ర ఎన్నికల సంఘం సంస్కరణల ప్రక్రియను ప్రారంభించాలని, పార్లమెంట్ కూడా ప్రత్యేక స్థాయి సంఘం ద్వారా చర్చించి అవసరమైన సిఫార్సులు చేయాలన్నారు. ఈ ప్రక్రియ అంతటికీ నిర్ణీత కాల వ్యవధిని నిర్ణయించాలని సోమవారం ఓ ప్రకటనలో సూచించారు.
ఎన్నికల సంస్కరణలు, డబ్బు నిర్వహించే పాత్రపై కేరళలోని కోజికోడ్‌లో మోదీ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. వెంటనే ఎన్నికల సంస్కరణలను చేపట్టాలని సీపీఐ, ఇతర వామపక్షాలు ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సంస్కరణల్లో భాగంగా దామాషా ప్రాతిపదికన ప్రాతినిధ్యం అనేది భారత్‌కు సంబంధించి అత్యంత ముఖ్యమైనదని పేర్కొన్నారు. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని, పాత్రను నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు.