అమెజాన్ చోరీ కేసులో సిబ్బందే నిందితులు
♦ రూ.17 లక్షల విలువైన 33 ల్యాప్‌టాప్‌ల రికవరీ
♦ ఐదుగురు నిందితుల అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
♦ సమావేశంలో వివరాలు వెల్లడించిన డీసీపీ పద్మజా
కొత్తూరు(రంగారెడ్డి జిల్లా):
గిడ్డంగిలో పనిచేసే సిబ్బంది, కొరియర్ నిర్వాహాకులే ఇటీవల అమెజాన్ గిడ్డంగిలో 36 ల్యాప్‌టాప్‌లను చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. శంషాబాద్ మండలం పాల్మాకుల ఔటర్ రింగురోడ్డు సమీపంలో పక్కా సమాచారంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరంచారు. సంఘటనకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డీసీపీ పద్మజా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పెంజర్ల గ్రామంలో ఉన్న అమెజాన్ ఆన్‌లైన్ గిడ్డంగిలోని ఎలక్ట్రానిక్స్ స్టోర్‌లో 20 హెచ్‌పీ, 16 ఆపీల్ ల్యాప్‌టాప్‌లు చోరికి గురైనట్లు సెక్యూరిటీ ఇన్‌చార్జి నాగసుబ్బారెడ్డి ఈ నెల 15వ తేదిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు గిడ్డంగిలో విధులు నిర్వహించే కొందరిని విచారించారు.
సిబ్బందే నిందితులు : రాసుల మహేష్, పాండు, చంద్రకాంత్, కృష్ణలు అమెజాన్ గిడ్డంగిలో విధులు నిర్వహిస్తున్నారు. వారు గతి కొరియర్ సంస్థకు చెందిన రాజు, సునీల్‌కుమార్‌లతో కలిసి చోరీకి పథకం రచించారు. ఇందులో భాగంగా మొదటిసారి 20 హెచ్‌పీ, రెండవ సారి 16 ఆపీల్ ల్యాప్‌టాప్‌లను ఎవ్వరికీ అనుమానం రాకుండా కస్టమర్స్‌కు అందించే పార్సిల్స్‌లోనే పెట్టి బయటకు తీసుకొచ్చారు. తర్వాత పార్సిల్స్‌ను విప్పి 36 ల్యాప్‌టాప్‌లను తమ దగ్గర ఉంచుకున్నారు. ఇదే సమయంలో స్టోర్‌లో ల్యాప్‌టాప్‌లు కనిపించకపోవడంతో నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు..విచారణలో భాగంగా వీరిపై పోలీసులకు అనుమానం వచ్చింది. అమెజాన్‌లో విధులు నిర్వహిస్తున్న మహేష్, పాండు, కృష్ణ, గతి కొరియర్ సంస్థకు చెందిన రాజు, సునీల్‌కుమార్‌లను అదుపులోకి తీసుకుని వారి నుంచి సుమారు రూ. 17 లక్షల 9 వేల విలువ ఉన్న 20 హెచ్‌పీ, 13 ఆపీల్ ల్యాప్‌టాప్‌లను స్వాదినం చేసుకున్నారు. కాగా మరో నిందితుడు చంద్రకాంత్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
సంస్థకు నోటీసు జారీ : అతిపెద్ద ఆన్‌లైన్ సంస్థగా పేరు ఉన్నప్పటికీ భద్రత పరంగా సరైన చర్యలు తీసుకోని కారణంగా అమెజాన్ గిడ్డంగి నిర్వాహాకులకు నోటీసు జారి చేయనున్నట్లు డీసీపీ తెలిపారు. అంతేకాకుండా ఇక మీదట ఇలాంటి చోరీలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.