లాస్ ఏంజెల్స్.. టీవీ, సినీ రంగాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన నగరం. ప్రత్యేకించి ఇక్కడుండే హాలీవుడ్ సైన్ గురించి చెప్పనక్కర్లేదు కదా. అలాంటి నగరం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా కూడా!. ముఖ్యంగా రైల్వే ట్రాకులపై చోరీలతో అమెజాన్‌లాంటి ఈ-కామర్స్ సైట్లు, రైల్వే ఆపరేట్లు విపరీతంగా నష్టపోతున్నారు.
లాస్ ఏంజెల్స్ కౌంటీ రైల్వే ప్యాసింజర్‌లతో ఉండే బిజీ రూట్. దీంతో గూడ్స్‌తో వెళ్లే రైళ్లను ఈ మార్గంలో చాలాసేపు నిలిపేస్తారు. ఇదే అదనుగా నేరస్థులు చెలరేగిపోతున్నారు. కంటెయినర్‌లను బద్ధలు కొట్టి.. అందులోని పార్శిల్స్‌ను ఎత్తుకెళ్లిపోతున్నారు. రమారమీ 2021లో ఇలా పార్శిల్స్‌ను ఎత్తుకెళ్లడం ద్వారా వాటిల్లిన నష్టం 5 మిలియన డాలర్ల( సుమారు 37 కోట్ల రూపాయలకు) అంచనా వేసింది ఈ రూట్‌లో రైళ్లు నడిపించే యూనియన్ ఫసిఫిక్.
తాజాగా శుక్రవారం ఓ భారీ చోరీ చోటు చేసుకోగా.. పోస్టల్ శాఖ పార్శిల్స్‌తో పాటు అమెజాన్, ఫెడ్‌ఎక్స్, టార్గెట్, యూపీఎస్ లాంటి ఈ-కామర్స్ కంపెనీల పార్శిల్స్ సైతం చోరీకి గురైనట్లు బయటపడింది. అంతేకాదు చోరీ తర్వాత ఆ బాక్స్‌లను పట్టాలపైనే పడేసి.. వాటిలో చాలావరకు డబ్బాలను కాల్చి పడేశారు కూడా.
కొత్తేం కాదు..
లాస్ ఏంజెల్స్ రైల్వే రూట్‌లో దొంగతనాలు ఈమధ్య కాలంలో జరుగుతున్నవేం కాదు. 2020 సెప్టెంబర్ నుంచి లాస్ ఏంజెల్స్ కౌంటీలో దొంగతనాల శాతం 160 మేర పెరిగిందని యూనియన్ ఫసిఫిక్ (రైల్వే ఆపరేటర్) చెబుతోంది. కరోనా టైం నుంచి ఈ నేరస్థులు చెలరేగిపోతున్నారు. పార్శిల్స్‌ను మోసుకెళ్లడం కష్టమవుతుందనే ఉద్దేశంతో వాటిని అక్కడే చించేసి.. కేవలం అందులోని వాటిని తీసుకెళ్తున్నారు. తక్కువ ధరలకే బయట అమ్మేసుకుంటున్నారు.
కొవిడ్-19 టెస్ట్ కిట్స్, ఫర్నీఛర్, మందులు.. చోరీకి గురవుతున్న వాటిలో ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా క్రిస్మస్, న్యూఇయర్ టైంలో ఈ తరహా చోరీలు ఎక్కువగా జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆ సీజన్‌లో సగటున రోజుకి 90కి పైగా కంటెయినర్‌లను ధ్వంసం చేసినట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో యూనియన్ పసిఫిక్ ఆ రైల్వే రూట్‌లో భద్రత కట్టుదిట్టం చేసింది. డ్రోన్ పర్యవేక్షణతో పాటు అదనపు భద్రతా సిబ్బందిని ట్రాక్‌ల వెంట కాపలా కోసం నియమించుకుంది. ఈ క్రమంలో వంద మంది నేరగాళ్లను అదుపులోకి సైతం తీసుకున్నట్లు యూనియన్ పసిఫిక్ చెప్తోంది. అంతేకాదు కాలిఫోర్నియా అటార్నీకి సైతం ఇలాంటి నేరాల్లో శిక్ష తక్కువ విధించడంపై సమీక్ష చేయాలంటూ కోరింది యూనియన్ పసిఫిక్ రైల్వే.
Comments
Please login to add a commentAdd a comment