
దమ్ముంటే 24 గంటల్లో రాజీనామా చేయండి
ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వైఎస్సార్‌సీపీ నేత అంబటి సవాలు
సాక్షి, హైదరాబాద్: టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు 24 గంటల సమయమిస్తున్నామని, వారికి సిగ్గు, లజ్జ, దమ్మూ ఉంటే పదవులకు రాజీనామాలు చేసి సైకిల్ గుర్తుపై గెలుపొందాలని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ప్రతి సవాలు విసిరారు. అంబటి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేసిన సవాలుపై తీవ్రంగా ప్రతిస్పందించారు.చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదివితే సరిపోదని, అమ్ముడుపోయినవారికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించిగానీ, వైఎస్సార్‌సీపీ గురించిగానీ మాట్లాడే నైతిక హక్కు లేనేలేదన్నారు.
తమకున్న 67 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది టీడీపీలోకి పోయినంతమాత్రాన వైఎస్సార్‌సీపీ వన్నె ఏమాత్రం తగ్గలేదని, రోజురోజుకూ ఇంకా ప్రజాభిమానం చూరగొంటూ తిరుగులేనిశక్తిగా ఎదుగుతోందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమన్నారు. ‘‘పార్టీ మూసేసుకుంటారా? అని మాట్లాడుతున్నవారికి ఏమాత్రం నైతిక విలువల్లేవు. వారు ఎవరి గుర్తుమీద, ఏ జెండాతో, ఎవరి ఫోటో పెట్టుకుని గెలిచారో... ఇపుడు ఏ పార్టీ జెండా కిందకు చేరి మాట్లాడుతున్నారో ఆత్మను ప్రశ్నించుకోవాలి’’ అని అన్నారు.