'తన పాపం బయటపడుతుందనే ఇలా.. '
అసెంబ్లీ నుంచి సస్పెండైన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీ వెలుపల గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ''నిన్నటి బిజినెస్ ఎజెండా చూడండి.. ఈ జాబితాలో అంబేద్కర్ గారి గురించి ఎక్కడా లేదు. ఆ అంశం మీద చర్చ జరుగుతుందని ఎక్కడైనా ఒక్క చోటైనా ఉందా అని అడుగుతున్నా. తొలిసారి వాయిదా పడినప్పుడు అంబేద్కర్ అంశం లేదు. రెండోసారి సభ వాయిదా పడిన తర్వాత చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్స్ రాకెట్‌కు సంబంధించిన చర్చ జరగకూడదని, జరిగితే తాను చేసిన పాపం బయటపడుతుందని భావించారు.
చంద్రబాబుతోను, ఇంటెలిజెన్స్ డీజీతోను నిందితుడు పిచ్చాపాటీ మీటింగ్ పెట్టుకున్నాడు. సీఎం అండదండలు లేకపోతే ఇలా కూర్చోగలడా? ఇక ఓ టీడీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ అనే నిందితునితో విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. తర్వాత ఎమ్మెల్యే తిరిగొస్తాడు గానీ నిందితుడు మాత్రం విదేశాల్లోనే ఆగిపోతాడు. ఆ నిందితుడు ఎక్కడున్నాడని పోలీసులు ఎమ్మెల్యేను ప్రశ్నించరు, కేసులు పెట్టరు. మరో ఎమ్మెల్సీ చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయన సొంత అన్న.. కాల్‌మనీ కేసులో నిందితుడు. వీళ్లిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. అయినా ఈ ఎమ్మెల్సీ మీద కేసు పెట్టరు, కస్టడీలోకి తీసుకోరు, ప్రశ్నించరు.
ఇవన్నీ చంద్రబాబు దీవనెలతో జరుగుతున్నాయి. ఆయన కొడుకు ఆశీస్సులు కూడా దీనికి ఉన్నాయి. ఈ చర్చను తప్పుదోవ పట్టించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారులందరి మీద దాడులు చేస్తారు. ఇదేదో మామూలు వడ్డీ వ్యాపారమని తేల్చేయడానికి చూస్తారు. కృష్ణాజిల్లాలో అతి హేయంగా ఆడవాళ్ల మానప్రాణాలతో ఆడుకుని, వారిని అశ్లీలంగా వీడియో టేపులు తీసి, వారిని బ్లాక్ మెయిల్ చేశారు. 200 పైచిలుకు వీడియో సీడీలు దొరికాయి. ఆడవాళ్లకు ఎక్కువ వడ్డీలకు అప్పులిచ్చి, అవి తీర్చలేదని వాళ్ల మాన ప్రాణాలతో ఆడుకుంటున్నారు. వాళ్లను శాశ్వతంగా వేశ్యవృత్తిలోకి దింపే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రాకెట్‌లో చంద్రబాబు నుంచి ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అంతా ఉన్నారు.
ఇంత ముఖ్యమైన అంశం మీద అసెంబ్లీలో చర్చ రాకుండా చేసేందుకు అంబేద్కర్ గారిని కూడా వాడుకున్నారు. చంద్రబాబు గట్టిగా అంబేద్కర్‌ను అడ్డుపెట్టుకున్నారు. పార్లమెంటులో రెండురోజులు చర్చిస్తే చంద్రబాబుకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. నవంబర్ 26న పార్లమెంటు చర్చించిందంటే, అది రాజ్యాంగ రచన పూర్తిచేసిన రోజు. అందుకే అప్పుడు పార్లమెంటులో దాని గురించి రెండు రోజులు చర్చించారు. దానికో అర్థం, పరమార్థం ఉన్నాయి. అంబేద్కర్ జయంతి, వర్ధంతి, రాజ్యాంగసభ తొలి సమావేశం, రాజ్యాంగాన్ని పార్లమెంటుకు సమర్పించిన రోజు.. ఈ రోజుల్లో ఎప్పుడూ చంద్రబాబుకు ఆయన గురించి చర్చ జరపాలని గుర్తుకు రాలేదు. ఈవాళ మాత్రం.. డిసెంబర్ 17, 18 తేదీల్లో గుర్తుకొస్తున్నారు. సెక్స్ రాకెట్ కేసులో తాను, తన వాళ్లు నిండా మునగడంతో బయట పడేందుకు ఇప్పుడు గుర్తుకొస్తున్నారు. ఇక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఒకసారి చూడండి.. ఆ విగ్రహాలను క్లీన్ చేయించాలన్న ఆలోచన కూడా లేదు. దుమ్ము, ధూళితో ఉన్నాయి. దండ ఎండిపోయింది. లోపల అసెంబ్లీలో మాత్రం అంబేద్కర్‌ను రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇంత రాక్షస పాలన ఎక్కడా ఉండదు. సెక్స్ రాకెట్‌లో ఉన్నవాళ్లు పేదలు కారా, అంబేద్కర్ బిడ్డలు కారా అని అడుగుతున్నా. వాళ్లను కాపాడే కేసును నీరుగార్చడానికి మీరు చేస్తున్నది కరెక్టేనా అని అడుగుతున్నా'' అన్నారు.
రాజకీయాల కోసం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను కూడా వాడుకోవడం దుర్మార్గమని ఇతర ఎమ్మెల్యేలు అన్నారు. మహిళల జీవితాలతో ఆడుకుంటున్న కాల్‌మనీ సెక్స్ రాకెట్ అంశాన్ని చర్చించాలని అడిగినందుకు తమను మార్షల్స్‌తో బలవంతంగా బయటకు తరలించారని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో మందబలంతో ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో ప్రజలంతా చూశారని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు. అత్యంత ముఖ్యమైన కాల్‌మనీ సెక్స్ రాకెట్ అంశంపై చర్చించడానికి అధికారపక్షానికి తీరికలేదా అని ప్రశ్నించారు.