
జీఎస్‌టీకి సవరణలు చేస్తే మేలు: ఈటెల
కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన సరుకు రవాణా సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) జీఎస్‌టీకి మరికొన్ని సవరణలు చేస్తే అంగీకరించేందుకు తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం సుముఖమేనని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన సరుకు రవాణా సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) జీఎస్‌టీకి మరికొన్ని సవరణలు చేస్తే అంగీకరించేందుకు తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం సుముఖమేనని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఆయారాష్ట్రాల ఆర్థికమంత్రులు గురువారం ఉదయం ఢిల్లీ సచివాలయంలో, కేంద్ర ఆర్థికమంత్రి ఆధ్వర్యంలో విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో 115 రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు జీఎస్‌టీ కారణంగా ఆయా రాష్ట్రాలపై పడే ప్రభావంపై సాధికారిక కమిటీ చర్చించింది.
ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద ర్ ప్రసంగిస్తూ, జీఎస్‌టీ కారణంగా రాష్ట్రాలు కోల్పోయే ఆదాయలోటును కేంద్ర ప్రభుత్వం పూడ్చేందుకు హామీ ఇవ్వాలని కోరారు. కేంద్రం నుంచి 2007 నుంచి తెలంగాణ రాష్ట్రానికి అందాల్సిన సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ (సీఎస్‌టీ) రూ. 5,000 కోట్లవరకు ఉందన్నారు. అపరిష్కృతంగా ఉన్న అంశాల కారణంగా రాష్ట్రాలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోలు, మద్యం, పోగాకు ఉత్పత్తులను కేంద్ర ప్రభుత్వం కొత్తగా తేనున్న జీఎస్‌టీ నుంచి మినహాయించాలని కోరారు. అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ పన్ను, వినోదపన్ను, బెట్టింగులపై విధించే పన్నులను సైతం మినహాయింపుల జాబితాలో చేర్చాలన్నారు.
జీఎస్‌టీని స్వాగతిస్తున్నాం: యనమల
జీఎస్‌టీలను తాము స్వాగతిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రసంగిస్తూ.. కేంద్ర ప్రతిపాదన ఆర్థిక అంశాల నిర్వహణతోపాటు కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలు బలపడేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.