దొంగలు దొరికారు
♦ ఆంధ్రా బ్యాంక్ లూటీ కి విఫలయత్నం
♦ ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలింపు
కుత్బుల్లాపూర్: ఆంధ్రాబ్యాంక్‌లో చోరీకి యత్నిం చిన ఇద్దరు పాత నేరస్థులను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాం డ్‌కు తరలించారు. శనివారం పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో డీసీపీ సాయి శేఖర్, ఏసీపీ అశోక్ కుమార్, సీఐ డీవీ రంగారెడ్డిలు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బిక్నూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన తుడుం స్వామి (25) అదే జిల్లాకు చెందిన దోమకొండ మం డలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన సడుగు నవీన్ (21)లు కుత్బుల్లాపూర్ సర్కిల్ వెన్నెలగడ్డ సమీపంతో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు.
వీరు కూలీ పనిచేస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తున్నారు. గతంలో ఓ హత్య, చెయిన్ స్నాచింగ్ చేశారు. శుక్రవారం తెల్లవారుజాము 4.30 సమయం లో వెన్నెలగడ్డ సమీపంలో ఉన్న ఆంధ్రాబ్యాంక్‌లో చోరీకి యత్నించి విఫలమయ్యారు. తరువాత ఐదు కంప్యూటర్లను మూట కట్టుకుని వెళ్తూ స్థానికుల కంట పడ్డారు.
ఆర్టీసీ డ్రైవర్ థామస్, కానిస్టేబుల్ విఘ్నేశ్వరుడు, హోంగార్డు కృపానందరెడ్డిలు సమయస్ఫూర్తితో వ్యవహరించి వెంటాడి తుడుం స్వామిని పట్టుకున్నారు. అతని సమాచారం మేరకు నవీన్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. కేసులో కీలకంగా వ్యవహరించిన థామస్, విఘ్నేశ్వరుడు, కృపానందరెడ్డిలను డీసీపీ సాయిశేఖర్ అభినందించి రివార్డు ప్రకటించారు.