- పోచారంలో ప్రారంభించిన కమిషనర్ సీవీ ఆనంద్
- 10 బైక్‌లు, 3 కార్లను విరాళంగా ఇచ్చిన ఇన్ఫోసిస్
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మరో ఐటీ కారిడార్ పెట్రోలింగ్‌కు కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం శ్రీకారం చుట్టారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అభయ ఘటన నేపథ్యంలో హైటెక్‌సిటీలో మహిళా ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. దీన్ని అధిగమించేందుకు సాఫ్ట్‌వేర్ కంపెనీల సహకారంతో రూపొందించిన ఐటీ కారిడార్ పెట్రోలింగ్ వ్యవస్థను గత డిసెంబర్ 18న డీజీపీ బి.ప్రసాదరావు ప్రారంభించిన విషయం తెలిసిందే.
మాదాపూర్, మియాపూర్, చందానగర్ ప్రాంతాలలో ఐటీ కారిడార్ పెట్రోలింగ్ వ్యవస్థ ద్వారా మంచి ఫలితాలు రావడంతో పోచారం ఐటీ కారిడార్‌లో కూడా ఇదే పద్ధతిలో పోలిసింగ్‌ను ఏర్పాటు చేయాలని గతంలోనే కమిషనర్ నిర్ణయించారు. ఈ మేరకు గతనెల ఐటీ కంపెనీ యజమానులు, సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులతో మహిళా ఉద్యోగుల భద్రతపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఐటీ కంపెనీలు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు పోచారంలోని ఇన్ఫోసిస్ కంపెనీ సైబరాబాద్ పోలీసులకు అందజేసిన 10 ద్విచక్ర వాహనాలు, మూడు బొలెరో పెట్రోలింగ్ వాహనాలను కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు.
ఐటీ ఉద్యోగినులకు మరింత భద్రత: సీవీ ఆనంద్
ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినులకు మరింత రక్షణ అందించడానికి ఐటీ కంపెనీలు సహకరించాలని కోరారు. పెట్రోలింగ్ వాహనాల వల్ల భద్రత మెరుగుపడుతుందన్నారు. సైబరాబాద్ సెక్యూరిటీ సొసైటీని ఏర్పాటు చేసి అందులో 80 ఐటీ కంపెనీలను సభ్యులుగా చేశామన్నారు. సైబరాబాద్ పరిధిలో గచ్చిబౌలి, ఘట్‌కేసర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్ ఐటీ కారిడార్‌లుగా ఏర్పడ్డాయన్నారు.
ఐటీ కారిడార్ పరిధిలో 45 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. పెట్రోలింగ్ వాహనాలను సమకూర్చిన ఇన్ఫోసిస్ సంస్థను ఆయన ప్రశంసించారు. ఈ వాహనాలను ఘట్‌కేసర్, మేడిపల్లి, ఉప్పల్ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని ఐటీ కారిడార్లలో వినియోగిస్తామన్నారు. కార్యక్రమంలో ఇన్ఫోసిస్ కేంద్ర అధికారి నరసింహన్, ప్రాంతీయాధికారి గుణాల్, అడిషనల్ డీసీపీ క్రైమ్ జి.జానకీ షర్మిల, డీసీపీ నవదీప్‌సింగ్, ఏసీపీ చెన్నయ్య, ఇన్‌స్పెక్టర్లు వెంకట్‌రెడ్డి, రవికిరణ్‌రెడ్డి, వీవీ చలపతి తదితరులు పాల్గొన్నారు.