
ఆన్‌లైన్ టోకరా కేసులో మరో నైజీరియన్ అరెస్టు
విదేశీ లాటరీ వచ్చిందంటూ మెసేజ్‌లు పంపి, వివిధ చార్జీల పేరుతో కర్నూలుకు చెందిన టైల్స్ వ్యాపారి నుంచి నగదు కాజేసిన ముఠాలో
సాక్షి, హైదరాబాద్: విదేశీ లాటరీ వచ్చిందంటూ మెసేజ్‌లు పంపి, వివిధ చార్జీల పేరుతో కర్నూలుకు చెందిన టైల్స్ వ్యాపారి నుంచి నగదు కాజేసిన ముఠాలో మరో సభ్యుడు నైజీరియన్ యుహుమ్‌వాన్సెబో జెరెమీని సీఐడీ అధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను అదనపు డీజీ సీహెచ్ ద్వారక తిరుమలరావు గురువారం వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఎబెగా మిఛెల్, యుహుమ్‌వాన్సెబో జెరెమీ నాలుగేళ్ల క్రితం స్టడీ వీసాపై భారత్‌కు వచ్చి ఢిల్లీలో స్థిరపడ్డారు.
తేలిగ్గా డబ్బు సంపాదించే ఉద్దేశంతో అనేక మంది సెల్‌ఫోన్లకు ఆన్‌లైన్ లాటరీ, క్యాష్‌ప్రైజ్ వచ్చాయంటూ మెసేజ్‌లు పంపేవారు. ఈ ఏడాది జనవరిలో కర్నూలుకు చెందిన టైల్స్ వ్యాపారి కె.వెంకటేశ్వరరెడ్డికి యూఎస్ సామ్‌సంగ్ లాటరీలో భారీ మొత్తం వచ్చిందని, నగదు కోసం సంప్రదించాలని ఎస్సెమ్మెస్ పంపారు. వెంకటేశ్వరరెడ్డిని పూర్తిగా ముగ్గులోకి దించిన తర్వాత నగదు రిలీజ్ కావడానికి ఆదాయపు పన్ను, నగదు మార్పిడి చార్జీల పేర్లు చెప్పి రూ.1.79 లక్షలు జమ చేయించుకున్నారు.
మూడు నెలలైనా లాటరీ సొమ్ము రాకపోవడంతో సీఐడీ అధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు మార్చి మొదటి వారంలో ఫిర్యాదు చేశాడు. ఎస్పీ కాంతి రాణా టాటా నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్ కె.శివాజీ తన బృందంతో కేసు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలను బట్టి ఎబెగా మిఛెల్ గుర్గావ్‌లో ఉన్నాడని గుర్తించి, జూన్ 25న అరెస్టు చేశారు. ఇతడి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను విశ్లేషించగా యుహుమ్‌వాన్సెబో జెరెమీని కీలక నిందితుడని తేలడంతో ఢిల్లీ వెళ్లిన ప్రత్యేక బృందం మంగళవారం ఇతన్ని పట్టుకుంది. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరిచి, పీటీ వారెంట్‌పై గురువారం హైదరాబాద్ తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు.