‘ఉగ్ర’కుట్రలో మరో ఇద్దరి అరెస్టు
- ముష్కర ముఠాకు చీఫ్‌గా వ్యవహరించిన యాసిర్
- ఉగ్రవాదులతో ‘ప్రతిజ్ఞ’ చేయించిన అథుల్లా రెహ్మాన్
- గత నెలలో వీరిని విచారించి వదిలిపెట్టిన ఎన్‌ఐఏ
- పక్కా ఆధారాలు లభించడంతో ఇప్పుడు అరెస్ట్
- ఎనిమిది రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగించిన కోర్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా విధ్వంసాలకు కుట్ర పన్నిన ఐసిస్ అనుబంధ సంస్థ ‘జుందుల్ ఖిలాఫత్ ఫీ బిలాద్ అల్ హింద్’ (జేకేబీహెచ్) మాడ్యూల్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. గత నెల 29న అరెస్టు చేసిన ఐదుగురు నిందితులను ఎన్‌ఐఏ అధికారులు న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. వారి విచారణలో మహ్మద్ అథుల్లా రెహ్మాన్, యాసిర్‌లు ఈ మాడ్యూల్‌లో అత్యంత కీలకమని బయటపడింది. దీంతో వీరిద్దరినీ మంగళవారం అరెస్టు చేసిన అధికారులు నాంపల్లిలోని ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపరిచారు.
ఈ ఇద్దరు ఆ ఆరుగురిలోని వారే..
ఉగ్రవాదుల కుట్రకు సంబంధించి కేంద్ర నిఘా వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం అందుకున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా గత నెల 20న ఎన్‌ఐఏకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ ఎన్‌ఐఏ యూనిట్ 29వ తేదీ తెల్లవారుజామున పాతబస్తీలోని ఎనిమిది ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో 11 మంది అనుమానిత ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకుంది. ప్రాథమిక విచారణ తర్వాత మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, అతడి సోదరుడు మహ్మద్ ఇలియాస్ యజ్దానీ, హబీబ్ మహ్మద్, అబ్దుల్ బిన్ అహ్మద్ అల్‌మౌదీ అలియాస్ ఫహద్, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్‌లను అరెస్టు చేసింది.
సరైన ఆధారాలు లేని కారణంగా మిగిలిన ఆరుగురినీ విడిచిపెట్టింది. అరెస్టు చేసిన ఐదుగురు ఉగ్రవాదులను ఎన్‌ఐఏ 12 రోజుల పాటు విచారించింది. అనంతపురం, మహారాష్ట్రలోని నాందే డ్ తదితర ప్రాంతాలకు వారిని తీసుకువెళ్లింది. మంగళవారం పాతబస్తీలోని వివిధ ప్రాంతా ల్లో దాడులు చేసి తూటాలతో పాటు ఇతర సామగ్రి స్వాధీనం చేసుకుంది. నిజాముద్దీన్ సహా కొందరు సాక్షుల్నీ విచారించి వాంగ్మూలాలు నమోదు చేసింది. గతంలో విడిచిపెట్టిన ఆరుగురిలో మహ్మద్ అథుల్లా రెహ్మాన్, నైమతుల్లా హుస్సేనీ అలియాస్ యాసిర్ మాడ్యూల్‌లో కీలకంగా వ్యవహరించారని వెలుగులోకి వచ్చింది. దీంతో మంగళవారం వారిని అరెస్టు చేశారు.
ముఠా నాయకుడు.. యాసిర్!
ఎన్‌ఐఏ అధికారులు ఇంత కుముందు ఇబ్రహీం యజ్దానీని మాడ్యూల్‌కు చీఫ్‌గా భావించారు. విచారణ తర్వాత సయ్యద్ నైమతుల్లా హుస్సేనీ అలియాస్ యాసిర్(42).. ‘అమీర్’ హోదాలో జేకేబీహెచ్ మాడ్యూల్‌కు చీఫ్‌గా ఉన్నట్లు వెల్లడైంది. మొఘల్‌పురా ప్రాంతానికి చెందిన ఇతడు అబు దర్బా పేరుతో చలామణి అయ్యాడు. ఖైరతాబాద్‌లో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్న యాసిర్.. ఉగ్ర మాడ్యూల్‌కు నిధుల సమీకరణలో కీలకపాత్ర పోషించాడు.
కస్టడీకి నలుగురు: తొలుత అరెస్టు చేసిన మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, మహ్మద్ ఇలి యాస్ యజ్దానీ, హబీబ్ మహ్మద్, అబ్దుల్ బిన్ అహ్మద్ అల్‌మౌదీ అలియాస్ ఫహద్, ముజ ఫర్ హుస్సేన్ రిజ్వాన్ కస్టడీ గడువు ముగియడంతో వారిని ఎన్‌ఐఏ అధికారులు మంగళవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు.
మరింత సమాచారం కోసం ఈ ఐదుగురిలో ఇబ్రహీం, ఇలియాస్ కస్టడీ గడువు పొడిగించడంతోపాటు తాజాగా అరెస్టు చేసిన రెహ్మాన్, యాసిర్‌లను కస్టడీకి అప్పగించాల్సిందిగా కోర్టును కోరింది. కోర్టు ఈ నలుగురిని 8 రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన ముగ్గురికీ జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో వారిని జైలుకు తరలించారు. కస్టడీలోకి తీసుకున్న వీరిని రాజ స్తాన్‌లోని అజ్మీర్‌కు తీసుకెళ్లే అవకాశం ఉంది.
ఎవరీ రెహ్మాన్?
చాంద్రాయణగుట్టలోని బండ్లగూడ ప్రాంతానికి చెందిన రెహ్మాన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. స్థానికంగా అరబిక్ బోధిస్తున్నాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంఏ (ఇంగ్లిష్) పూర్తి చేశాడు. స్థానికంగా ఇంగ్లిష్ ట్యూషన్లతోపాటు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేవారికి టోఫెల్ పరీక్షకు శిక్షణ ఇచ్చేవాడు. ఈ ఉగ్రముఠాలోని వారంతా తమ కార్యకలాపాలకు భవానీనగర్‌లోని తలాబ్‌కట్టలో షాలిమార్ ఆన్‌లైన్ సేవ పేరుతో ఉన్న మీ సేవ కేంద్రాన్ని వినియోగించుకుంది. ఇక్కడే సమావేశమైన ముష్కరులు ఐసిస్ అధినేత అబూ బకర్ అల్ బగ్దాదీకి (ఖలీఫా) బద్ధులమై ఉంటామని, కాలిఫట్‌గా పిలిచే సైన్యంగా మారుతామని ప్రమాణం చేశారు. ఈ ప్రమాణం (బయాహ్) చేయించడంతో పాటు కుట్రల అమలుకు జరిగిన సమావేశాల్లో రెహ్మాన్ కీలకంగా వ్యవహరించాడు.