
'గాంధీ కుటుంబంపై కక్ష సాధింపు'
గాంధీ కుటుంబంపై మోదీ ప్రభుత్వం కక్ష కట్టి కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ఠ పాలు చేయాలని కుట్ర పన్నిందని టీపీసీసీ అధ్యక్షుడు ఆరోపించారు.
- ప్రజా వ్యతిరేక పాలనలో కేంద్ర, రాష్ట్రాలు
- ప్రజలు గుణపాఠం చెబుతారు
హైదరాబాద్ : గాంధీ కుటుంబంపై మోదీ ప్రభుత్వం కక్ష కట్టి కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ఠ పాలు చేయాలని కుట్ర పన్నిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం కుత్బుల్లాపూర్‌లోని వైఎంఎస్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక దినం ముగింపు సభకు సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, వీ హనుమంతురావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, సబితా ఇంద్రారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్‌తోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
2019లో అధికారం కాంగ్రెస్‌దే : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియ
ఉగ్రవాద వ్యతిరేక దినం ముగింపు సభకు హాజరైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియ మాట్లాడుతూ.. ఈ రోజు దేశప్రజలంతా సోషల్ మీడియా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడానికి రాజీవ్ ముందుచూపే కారణమన్నారు. రాజీవ్ విదేశాంగ విధానం ద్వారా భారత్ ప్రపంచ దేశాలకు మిత్రదేశంగా నిలవగా, మోదీ విదేశాంగ విధానం వల్ల నేపాల్, శ్రీలంక లాంటి మిత్రదేశాలు కూడా ఇతరదేశాలపై ఆధారపడుతున్నాయన్నారు. సోనియా, రాహుల్ నేతృత్వంలోనే 2019లో దేశం, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు పట్టెడు అన్నం పెట్టే ఎన్‌ఆర్‌జీయస్ పథకాన్ని మోదీ మార్చాలనే ప్రయత్నాన్ని రాహుల్ అడ్డుకున్నారని ఆయన తెలిపారు.
దిగజారుడు రాజకీయాలను ప్రోత్సహిస్తున్న కేసీఆర్ : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
ఇతర పార్టీల నుంచి గెలిచిన నాయకుల్ని అవినీతి సొమ్ముతో కేసీఆర్ కొనుగోలు చేస్తూ దిగజారుడు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.తెరాస ప్రభుత్వాన్ని కూల్చాలని కాంగ్రెస్ పార్టీ కుట్రపన్నారని కేసీఆర్ అనడం పచ్చిఅబద్ధమన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గాంధీ కుటుంబంపై కక్ష కట్టి కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ఠ పాలు చేయాలని చూస్తోందని ఆయన అన్నారు. ప్రజలే ఈ రెండు ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు.
టీఆర్‌ఎస్‌లో చేరినవారు దద్దమ్మలే : మాజీ మంత్రి సర్వే సత్యనారయణ
ఉగ్రవాద వ్యతిరేక దినం ముగింపు సభకు హాజరైన మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరుపై, పార్టీ ఫిరాయింపులపైనా ఘాటైన విమర్శలు చేశారు. తెరాస ప్రభుత్వంలో ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి తెరాసలో చేరినవాళ్లంతా దద్దమ్మలు, సన్యాసులేనని ఆయన విమర్శించారు. తెరాస గెలిచిన ఎన్నికలన్నీ ఈవీఎంల టాంపరింగ్ తోనేనని, సొంత బలంతో కాదన్నారు.
రాజీవ్ ఉంటే దేశం ముందుండేది : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రాజీవ్ గాంధీ ఉండి ఉంటే ప్రపంచపటంలో మన దేశం ముందుండేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాజీవ్,ఇందిరాగాంధీల చరిత్ర భావితరాలకు ఆదర్శమన్నారు. ప్రతిఒక్కరు రాజీవ్ ఆశయాల అడుగుజాడల్లో నడవాలని ఆమె పిలుపు నిచ్చారు.
గాంధీ కుటుంబంతో మరిచిపోలేని అనుబంధం : వి.హనుమంతరావు
రాజీవ్, ఇందిరా గాంధీలతో నా అనుబంధం మరిచిపోలేనిదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మాటలు తప్ప అభివృద్ధికి చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు.