ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యనేతలు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యనేతలు ఫిర్యాదు చేశారు. కరవు, వరదలు వంటి అంశాలపై ఏపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించదంటూ గురువారం బొల్లారంలో రాష్ట్రపతిని ఏపీ కాంగ్రెస్ ముఖ్యనేతలు పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య, కాంగ్రెస్ నేత, సినీహీరో చిరంజీవి ఇతర నేతలు కలిశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా అమలయ్యేలా కేంద్రాన్ని ఆదేశించాలని డిమాండ్ చేశారు.
రాజధాని భూములను ప్రభుత్వం విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతోందని విమర్శించారు. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి పర్యావరణ అనుమతులు.. జీవో 97ను రద్దు చేయాలని ప్రణబ్ను కోరినట్టు చెప్పారు. ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుతో పాటు 99 ఏళ్లు రాజధాని భూముల లీజును కూడా తిరస్కరించేలా గవర్నర్ నరసింహన్కు సూచించాలని ప్రణబ్ను కోరినట్టు ఏపీ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.