'ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు రాష్ట్రపతికి ఇచ్చాం'
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేసినట్లు ఏపీ మంత్రులు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల విషయంలో జోక్యం చేసుకొని ప్రత్యేక సెల్ ఏర్పాటుచేయాలని కూడా తాము విజ్ఞప్తి చేసినట్లు తెలియజేశారు. మంగళవారం ఏపీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి కలిసి రాష్ట్రపతితో అయిన భేటీ ముగిసిన అనంతరం వాటి వివరాలు తెలిపారు. సెక్షన్ 8 అమలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్రపతితో చర్చించామని వారు తెలిపారు. విభజన చట్టంలోని సెక్షన్ 8ని తప్పనిసరిగా అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. 120 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లుందని, ఎంపీ గరికపాటి, సెబాస్టియన్ ఫోన్ ట్యాపింగ్ ఆధారాలను రాష్ట్రపతికి ఇచ్చామని వారు తెలిపారు.
సెక్షన్ 8పి అమలు చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం అంటోందన్న విషయం కూడా రాష్ట్రపతికి చెప్పామన్నారు. ఉద్యోగ సంఘాలవారిని సీఎం కేసీఆర్ రెచ్చగొడుతున్నారని, ఇంకా ఆయన ఉద్యమ భాషను వదిలిపెట్టడంలేదని ఫిర్యాదు చేశారు. రాజధాని రెండు ప్రభుత్వాలకు ఉన్నప్పుడు ఒక ప్రభుత్వంపై మరొక ప్రభుత్వ పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో సెక్షన్ 8 అమలుపై తాము కీలక నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పారు.
రాష్ట్రపతితో ముగిసిన ఏపీ కాంగ్రెస్ నేతల భేటీ
రాష్ట్రపతితో మంగళవారం ఏపీ కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. ఈ సందర్భంగా భేటీ వివరాలు ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తెలుపుతూ ఓటుకు కోట్లు విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసినట్లు రఘువీరా తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో ఏపీకి అన్యాయం జరిగిందని, ప్రత్యేక హోదా కల్పించాలని ఆయనను కోరినట్లు చెప్పారు. రాజధాని నిర్మాణంలో సారవంతమైన భూములు వినియోగించకూడదని ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ నేతల్లో సుబ్బిరామిరెడ్డి, సి రామచంద్రయ్య కూడా ఉన్నారు.