వడదెబ్బ మృతులకు ఆపద్బంధు
కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కరువు, వడగాడ్పులు, ఎండలు, భూగర్భ జలాలు తగ్గిపోవటంతో ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఏ ప్రాంతంలోనైనా ప్రజలు తిండి లేక బాధ పడితే వెంటనే స్పందించాలని, ప్రభుత్వం అక్కడ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. పశుగ్రాసం ఎక్కడెంత అవసరముందో అంచనా వేసి అందజేయాలన్నారు. శుక్రవారమిక్కడ ఎంసీహెచ్‌ఆర్‌డీలో కలెక్టర్ల సదస్సు జరిగింది.
అయిదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో సీఎం వివిధ అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశా రు. వడ దెబ్బతో మరణించిన వారి కుటుం బాలకు ఆపద్బంధు పథకం ద్వారా ఆర్థిక సాయం (రూ.50 వేలు) అందించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. 65 సంవత్సరాల లోపు వారికే ఈ పథకం వర్తింపజేయాలనే నిబంధన తొలగిం చాలని సూచించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉపాధి హామీ పనులు.. ఉదయం పదిన్నర లోపు, సాయంత్రం నాలుగున్నర తర్వాతే చేయించాలన్నారు. ‘‘ఎండలు తీవ్రంగా ఉన్నాయి.
మరో నెలన్నర వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. అప్పటి దాకా పరిస్థితిని ఎదుర్కొనే కార్యాచరణ ఉండాలి. తగినన్ని ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలి. చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. మంచినీరు అందని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలి. మిషన్ భగీరథ పూర్తయితే మంచినీటికి కొదవుండదు. మిషన్ కాకతీయ పూర్తయితే చెరువులు నిండి భూగర్భ జలమట్టం పెరుగుతుంది. సిద్దిపేటలో తాగునీటి పథకం అమలవుతున్నందున అక్కడ కరువు ప్రభావం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి రావాలి’’ అని సీఎం అన్నారు.
చెరువుల పనుల్లో వేగం పెంచండి
‘‘ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే వ్యవసాయ భూముల్లోంచి పోయే పైపులైన్ల నిర్మా ణం పూర్తి చేయాలి. వర్షాలు వస్తే పనిచేయడం కుదరదు..’’ అని సీఎం కలెక్టర్లను అప్రమత్తం చేశారు. మిషన్‌భగీరథ పనులను సీఎం జిల్లాల వారీగా సమీక్షించారు. మిషన్ కాకతీయలో మొ దటి విడత చెరువుల పనులు తొందరగా ము గించి, రెండో విడతలో 9 వేల చెరువుల పనులు శరవేగంతో చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. ఒకేసారి పెద్ద మొత్తంలో నిర్మాణ పనులు జరుగుతున్నందున మిషనరీ, సిబ్బంది కొరత అధిగమించే ప్రణాళిక రూపొందించాలన్నారు. నిర్ణీతకాల వ్యవధికి సిబ్బందిని నియమించుకోవాలని, ఏ అధికారి ఎంత పని చేయగలడో శాస్త్రీయంగా అంచనా వేసి పని విభజన చేయాలని చెప్పారు. పనుల్లో నాణ్యత పాటించాలని స్పష్టంచేశారు.
పత్తి వద్దు.. సోయాబీన్ ముద్దు
భవిష్యత్తులో పత్తి ప్రమాదంలో పడుతుందని, ధర పడిపోతుందని ముఖ్యమంత్రి చెప్పారు. 42 లక్షల ఎకరాల్లో ప్రస్తుతం పత్తి పంట వేస్తున్నారని, ఆ సాగును 15-20 లక్షల ఎకరాలకు తగ్గించాలని అధికారులకు సూచించారు. ప్రత్యామ్నాయంగా సోయాబీన్, మొక్కజొన్న పంటలు సాగు చేసేలా రైతుల్లో అవగాహన పెంచాలన్నారు. సోయాబీన్, మొక్కజొన్న విత్తనాలను సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. విత్తనాలను అయిదు ఎకరాల లోపు రైతులకే వర్తింపజేయాలని, ఒకే పంట వేసే వారికిచ్చే సబ్సిడీలు రెండున్నర ఎకరాలకు ఇవ్వాలనే నిబంధన తీసేయాలని సీఎం చెప్పారు.
రాష్ట్రంలోని రైతులందరికీ ఎలాంటి తేడా లేకుండా సోయాబీన్‌పై సబ్సిడీ ఇవ్వాలని ఆదేశించారు. విత్తే పరికరాలను సబ్సిడీపై అందించాలని చెప్పారు. వచ్చే ఖరీఫ్‌కు అవసరమైన విత్తనాలను ముందే తెచ్చుకుని నిల్వ చేసినట్లు అధికారులు సీఎంకు చెప్పారు. రైతులకు అవసరమయ్యే 4.5 లక్షల టన్నుల ఎరువులను బఫర్ స్టాక్‌గా పెట్టామని మార్కెటింగ్ ఎండీ శరత్ చెప్పారు. కొత్తగా నిర్మించే గోదాములు, ఇప్పటికే అందుబాటులో ఉన్న గోదాములను విత్తనాలు, ఎరువుల నిల్వకు ఉపయోగించాలని సీఎం అన్నారు. పత్తి సాగును నిరుత్సాహపరిచేలా తాము ప్రణాళిక రూపొందించినట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి చెప్పా రు. తక్కువ విత్తనంతో ఎక్కువ దిగుబడి వచ్చే సేలం పసుపు సాగు చేసేలా ప్రోత్సహించాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.
రైతుల ఖాతాలు పరిశీలించండి..
రైతుల రుణమాఫీ మూడో విడత నిధులు విడుదల చేయనున్నందున, రుణమాఫీ సాఫీగా జరిగేలా చూడాలని సీఎం కలెక్టర్లకు సూచిం చారు. రుణమాఫీ పొందే రైతుల బ్యాంకు ఖాతాలను మరోసారి క్షుణ్నంగా పరిశీలించాలని, ఆడిటర్ల సహకారం తీసుకోవాలని సూచించారు.
కొత్త రెసిడెన్షియల్ స్కూళ్లకు ఏర్పాట్లు
2016-17 విద్యాసంవత్సరం నుంచి మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలకు 250 రెసిడెన్షియల్ స్కూళ్లు నడిపేందుకు అవసరమైన ఏర్పాట్లను కలెక్టర్లు పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ కోరారు. భవనాలు నిర్మించేందుకు సమయం పడుతుందని, ఈలోపు తరగతులు, హాస్టల్ నిర్వహణకు అద్దె భవనాలు సమకూర్చుకోవాలని చెప్పారు. మైనారిటీ రెసిడెన్షియళ్లకు ఇప్పటికే స్థల సేకరణ జరుగుతోందని, ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు స్థల సేకరణ జరగాలని వివరించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, జోగు రామన్న, తలసాని, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీనియర్ అధికారులు ఎస్‌పీ సింగ్, ఎస్‌కే జోషి, బీఆర్ మీనా, సురేష్ చంద్ర, తివారీ, శరత్, రామకృష్ణారావు, నవీన్ మిట్టల్, వికాస్‌రాజ్, షపీ ఉల్లా, నర్సింగ్ రావు తదితరులు సదస్సులో పాల్గొన్నారు.
ఈ ఏడాది 106 శాతం వానలు
ప్రస్తుతం వేసవితో పాటు వచ్చే వానాకాలం ఎలా ఉంటుందనే అంశంపై కూడా సదస్సులో చర్చ జరిగింది. ఈసారి ఖరీఫ్‌లో 106 శాతం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ డెరైక్టర్ వైకే రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులపై ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం సూచించారు. మే 15న మరోసారి వాతావరణ శాఖ అధ్యయన నివేదిక వెలువడుతుందని, అప్పుడు మరింత స్పష్టత వస్తుందని సీఎం చెప్పారు.
ఉద్యమ స్ఫూర్తితో హరితహారం
గత ఏడాది వర్షాలు సరిగా లేనందున హరితహారంలో అనుకున్నట్లుగా మొక్కలు పెంచలేకపోయామని, వచ్చే వానాకాలంలో ఉద్యమ స్ఫూర్తితో మొక్క లు నాటాలని సీఎం పిలుపునిచ్చారు. సమాజంలోని అన్ని వర్గాలను ఇందులో భాగస్వాములను చేయాలన్నారు. రాష్ట్రంలోని వివిధ నర్సరీలలో 46.30 కోట్ల మొక్కలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ఇళ్లల్లో పెంచేందుకు పండ్ల మొక్కలు సరఫరా చేయాలని, మొక్కలు నాటడానికి గుంతలు తీసే పనిని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. ఆర్‌వోఎఫ్‌ఆర్ భూముల్లో యూకలిప్టస్ మొక్కలు పెంచాలని సూచించారు. మొక్కలు నాటడం, పెంచడంలో స్ఫూర్తిదాయక పాత్ర పోషించిన వారికి హరిత మిత్ర అవార్డులు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ప్రతిపాదనలు పంపించాలని కోరారు.