సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీల వంటి ఉన్నతాధికారులకే రూ.60 వేలకు మించిన సెల్‌ఫోన్ తీసుకునే అవకాశం లేదు. గతంలో ఈ ఖర్చులు అంతకంటే తక్కువగా ఉండేవి. ఇటీవల ప్రభుత్వం సెల్‌ఫోన్ ఖర్చులను పెంచుతూ జీవో జారీ చేయడంతో రూ.60 వేల వరకు అర్హత ఉంది. కానీ జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు ఏకంగా రూ.లక్ష కంటే ఎక్కువ విలువైన యాపిల్ సెల్‌ఫోన్లు కొనుక్కునేందుకు ఆమోదం పొందారు.
గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయాలు తీసుకునేది.. ఆమోదం తెలిపేది వారే కావడంతో ఇక వారికి అడ్డే లేకుండా పోయింది. కమిటీ సభ్యులు 15 మందికి 15 సెల్‌ఫోన్లకు రూ.17 లక్షలు ఖర్చు చేసేందుకు ప్రతిపాదించి, ఏకగ్రీవంగా ఆమోదించుకున్నారు. గతేడాది ఉన్న స్టాండింగ్ కమిటీ సభ్యులు సైతం ఈ మాదిరే ఐపాడ్లను పొందారు. ఇలా అడ్డూ అదుపూ లేకుండా కమిటీ సభ్యులు ఖర్చు చేస్తున్నప్పటికీ.. పట్టించుకునేవారు గానీ.. ఇదేంటని అడిగేవారు గానీ లేరు.