ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త | army public school notification issuesd for teacher recruitment | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త

Published Tue, Aug 30 2016 4:17 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త

ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త

హైదరాబాద్ : ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వేలాది విద్యార్థులకు ఇదో శుభవార్త. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ కింద దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో 8 వేల మంది ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న కంటోన్మెంట్ ఏరియాలు, మిలటరీ స్టేషన్లలో నడుస్తున్న మొత్తం 137 ఆర్మీ పబ్లిక్ స్కూళ్ల (ఏపీఎస్) లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను ఆన్ లైన్ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు.

దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఆన్ లైన్ లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. వచ్చే నవంబర్ నెల 26, 27 తేదీల్లో ఈ ఆన్ లైన్ పరీక్ష నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. వచ్చిన దరఖాస్తులను బట్టి ఏవైనా మార్పు చేర్పులు చేయాల్సి వస్తే పరీక్షను నవంబర్ లో చివరి ఆదివారం లేదా డిసెంబర్ లో వచ్చే మొదటి ఆదివారం రోజున స్క్రీనింగ్ టెస్టు నిర్వహించడానికి ఆవకాశాలున్నాయి.  ఇందులో అర్హత సాధించిన వారికి స్కోర్ కార్డులు జారీ చేస్తారు. డిసెంబర్ 15 న ఫలితాలను వెల్లడిస్తారు. అభ్యర్థులు http://aps-csb.in పోర్టల్ లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

స్కోర్ కార్డు ఆధారంగా తదుపరి దశల్లో నిర్వహించే పరీక్షకు అర్హత సాధిస్తారు. ఆ స్కోర్ కార్డులు మూడేళ్ల పాటు పనికొస్తుంది. స్కోర్ కార్డు వచ్చిన తర్వాత రెండో దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. మూడో దశలో ఆయా సబ్జెక్టుల్లో  స్కిల్స్ ను పరిశీలించడానికి ఎస్సే, కాంప్రిహెన్షన్ లపై రాత పరీక్ష నిర్వహిస్తారు. సెప్టెంబర్ 13 లోగా ఆన్ లైన్ లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రధానంగా పీజీటీ, టీజీటీ, పీఆర్ టీ ఉపాధ్యాయ పోస్టుల ఎంపిక కోసం ఈ ఆన్ లైన్ పరీక్ష నిర్వహిస్తున్నారు. పీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు బీఎడ్ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే టీజీటీ, పీఆర్టీ పోస్టులకు డిగ్రీతో పాటు బీఎడ్ తప్పనిసరిగా ఉండాలి. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు సంబంధించి ఇంగ్లీషు, హిందీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్, సైకాలజీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేటిక్స్, హోం సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయి. టీజీటీ పోస్టులు ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం, హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నట్టు నోటిఫికేషన్ లో తెలియజేసారు.

ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు, బీఏడ్ లో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. 1 ఏప్రిల్ 2017 నాటికి 40 ఏళ్ల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఇకపోతే, టీజీటీ, పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సీటెట్, లేదా ఆయా రాష్ట్రాలు నిర్వహించిన టెట్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాంటి వారిని రెగ్యులర్ ప్రాతిపదిక నియమిస్తారు. ఆ అర్హతలు లేని అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ ఎంపికైతే అలాంటి అభ్యర్థులను హడ్ హక్ ప్రాతిపదికన నియమిస్తారు. రెగ్యులరైజేషన్ కోసం ఆ తర్వాత దశలో టెట్ అర్హత సాధించాల్సి ఉంటుంది.

పీజీటీ, టీజీటీ కోసం పార్ట్ ఏ, పార్ట్ బీ పేరుతో ఆన్ లైన్ లో రెండు పరీక్షలు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ, కాంప్రిహెన్షన్, ఎడ్యుకేషనల్ కాంసెప్ట్స్, మెథడాలజీ ఉంటాయి. పార్ట్ బీ లో సంబంధిత సబ్జెక్టులపై ప్రశ్నలుంటాయి. ఒక్కో పార్ట్ లో పరీక్ష 3 గంటల పాటు ఉంటుంది. ఒక్కో పార్టులో 90 మార్కుల చొప్పున మొత్తం 180 మార్కులకు నిర్వహిస్తారు. పీఆర్టీలకు మాత్రం పార్ట్ ఏ మాత్రమే ఉంటుంది. అర్హత సాధించడానికి అభ్యర్థి ప్రతి పార్ట్ లో కనీసం 50శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు www.awesindia.com. చూసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement