
త్వరలో అగ్ర రాష్ట్రంగా తెలంగాణ
ఎన్నారైలతో సీఎం కేసీఆర్
- రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోంది
- పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్
- ముందుకొచ్చే ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తామని వెల్లడి
- పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసిన ఎన్నారైలు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే దేశంలో అగ్రస్థానాన్ని సాధించడం ఖాయమని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్షేమం, ఆర్థిక రంగాల్లో రాష్ట్రం తిరుగులేని అభివృద్ధిని నమోదు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆది వారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రముఖులు, ఎన్నారైలతో కేసీఆర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, కొత్తగా తలపెట్టే కార్యక్రమాలపై తన అభిప్రాయాలను వారితో పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టిగా ఉందని వివరించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్రత్యేకతలను విశదీకరించారు.
భగీరథ పైపులతో పాటు ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌లను వేస్తున్నామని, త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి పల్లె డిజిటల్ గ్రామంగా రూపుదిద్దుకుంటుందని కేసీఆర్ తెలిపారు. దేశ విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారని.. నగరానికి ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితులు, ఇక్కడి మానవ వనరులు, భాష, సంస్కృతి, సాంప్రదాయాలే ఇందుకు కారణమని పేర్కొన్నారు. నదీ జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని.. తాగునీరు, సాగునీటి రంగాల్లో మరింత పురోగతి సాధిస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు ముందుకొచ్చే ప్రతి ఒక్కరినీ ప్రాంతాలకతీతంగా స్వాగతిస్తామన్నారు.
పెట్టుబడులకు సిద్ధమన్న ఎన్నారైలు..
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఎన్నారైలు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇక్కడ టెక్నా లజీ రంగం అభివృద్ధికి సహకరించే దిశగా పెట్టుబ డులు పెడతామని వారు పేర్కొన్నారు. టీ బ్రిడ్జి పేరిట ఐటీ మంత్రి కేటీఆర్ ఇటీవల అమెరికలోని వాషింగ్టన్‌లో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నా రని.. అదే పద్ధతిలో వాషింగ్టన్ డీసీ ఈస్ట్‌కోస్ట్ ప్రాం తం నుంచి తాము సిద్ధంగా ఉన్నామని సీఎంకు వివరించారు. దీంతో త్వరలో మరోసారి సమావే శమై దీనిపై నిర్దిష్ట కార్యచరణ సిద్ధం చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, ఎన్నారైలు రవి పల్లా, రామ్ మట్టపల్లి, జై చల్లా, నర్సింహా కొప్పుల, వేణు కడారి తదితరులు పాల్గొన్నారు.