ఆశా వర్కర్ కిడ్నాప్.. గ్యాంగ్ రేప్..!
సంగారెడ్డి: మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విధులకు వెళ్లి వస్తున్న ఆశా వర్కర్ ను కొందరు గుర్తు తెలియని దుండగులు కారులో ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. నర్సాపూర్ లో ఓ సమావేశానికి ఆశా వర్కర్ హాజరైంది. రాత్రివేళ మీటింగ్ పూర్తయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్లేందుకు నర్సాపూర్ బస్టాండ్ కు వెళ్తోంది. ఇంతలో అయిదుగురు గుర్తుతెలియని దుండగులు ఆశా వర్కర్ ను కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి బాధితురాలిపై సామూహిక అత్యాచారం చేసి ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. రాత్రంతా వర్షం కురవడం, ఆ వైపుగా ఎవరూ వెళ్లకపోవడంతో నిన్న ఎవరూ ఆమెను గమనించలేదు. దీంతో ఎలాంటి సహాయం లేక రాత్రి ఆ ప్రదేశంలోనే బాధితురాలు ఉండిపోయింది.
శనివారం ఉదయం అటుగా వెళ్తున్న కొందరు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు బాధితురాలిని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలికి తీవ్ర రక్తస్రావం అవుతుందని, ఆమె షాక్ నుంచి ఇంకా తేరుకోలేదని పోలీసులు వెల్లడించారు. మైరుగైన చికిత్స నిమిత్తం ఆశా కార్తకర్తను హైదరాబాద్ కు తరలించాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతానికైతే ఆమె పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలు తెలిపిన వివరాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు.