మండలి కూడా వాయిదా
- 18 రోజుల పాటు జరిగిన శీతాకాల సమావేశాలు
- 94.56 గంటల పాటు సాగిన చర్చలు
- 15 అంశాలపై స్వల్పకాలిక చర్చ
- 16 బిల్లులను పాస్ చేసిన అసెంబ్లీ
- 66.25 గంటలు నడిచిన శాసనమండలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. గత నెల 16న మొదలైన సమావేశాలు 18 పనిదినాలపాటు జరిగాయి. బుధవారం మైనార్టీ సంక్షేమంపై చర్చ పూర్తయిన తర్వాత స్పీకర్ ఎస్.మధుసూదనాచారి సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మొదటి విడతలో 16 రోజులు, పది రోజుల సెలవు తర్వాత రెండో విడతలో రెండు రోజులు (మంగళ, బుధవా రాలు) సమావేశాలు జరిగాయి. మొత్తంగా 18 పనిదినాల్లో ఆయా అంశాలపై 94 గంటల 56 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. 15 అంశాలపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. ప్రభుత్వం 16 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకుంది. పలు కీలకమైన, విధాన నిర్ణయాల ప్రకటనకూ ఈ సమావేశాలు వేదికయ్యాయి. విద్యుత్ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ‘ఉదయ్’ పథకంలో చేరుతు న్నట్లు సీఎం ప్రకటించారు. ఒంటరి మహిళలకు రూ.వెయ్యి పెన్షన్, బీసీ సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లు, సైనిక సంక్షేమం వంటి అంశాలపైనా ప్రకటనలు చేశారు.
ప్రతిపక్షమే ఎక్కువ
ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడిన సమయాన్ని మినహాయించి పార్టీల వారీ గా చూస్తే.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సభ్యులు 19.13 గంటలపాటు మాట్లాడారు. తర్వాత టీఆర్‌ఎస్ 17.21 గంటలు, బీజేపీ 10.10 గంటలు, ఎంఐఎం 6.54 గంటలు, టీడీపీ 06.05 గంటలు, సీపీఎం 01.42 గంటలు వినియోగించుకున్నాయి. ఇక సీఎం, మంత్రులు కలిసి 33.28 గంటల సమయం వినియోగించుకున్నా రు. 18 రోజుల్లో 94.56 గంటలపాటు సాగిన సమావేశాల్లో.. విపక్షాలు 1.03 గంటలు సభకు అంతరాయం కల్పించాయి. ఇందులో కాంగ్రెస్ 43 నిమిషాలు, ఎంఐఎం 05 నిమిషాలు, టీడీపీ 15 నిమిషాలపాటు అంతరాయం కల్పించాయి.
110 ప్రశ్నలకు సమాధానాలు
ఈ సమావేశాల్లో అధికార, విపక్ష సభ్యులు కలిపి మొత్తంగా 110 ప్రశ్నలు వేసి.. ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టారు. వీటికి 361 అనుబంధ ప్రశ్నలు కూడా వేశారు. దాదాపు అందరు సభ్యులూ చర్చల్లో పాల్గొన్నారు. చాలా మందికి జీరో అవర్‌లో అవకాశం లభించింది. సభ్యులు 186 ప్రసంగాలు చేశారు. 15 అంశాల పై లఘు చర్చ జరగగా.. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై చేపట్టిన చర్చ 4.57 గంటలపాటు జరిగింది. వ్యవసాయం, రుణమాఫీపై 4.36 గంటలు, జీహె చ్‌ఎంసీపై 4.10 గంటలు, మైనారిటీ సంక్షేమంపై 3.27 గంటలు చర్చ సాగింది.
66.25 గంటలపాటు మండలి సమావేశాలు
శాసనమండలి సమావేశాలను కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ కె.స్వామిగౌడ్ బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా సభలో పార్టీల వారీగా బలాబలాలు, శాసనమండలి ఎన్ని రోజులు కొలువు దీరింది, ఎన్ని గంటల పాటు సమావేశాలు జరిగాయి తదితర అంశాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మొత్తంగా శాసన మండలి కూడా 18 రోజుల పాటు సమావేశమైంది. 66.25 గంటల పాటు చర్చలు జరగగా... సభ్యులు 108 ప్రసంగాలు చేశారు. 14 అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. సభ్యులు 139 ప్రశ్నలు వేశారు. 16 బిల్లులను మండలి ఆమోదించింది.