సుల్తాన్‌బజార్ (హైదరాబాద్) : ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్పడి ఆటో దగ్ధం అయిన సంఘటన గురువారం అఫ్జల్‌గంజ్ పోలీసుస్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించింది. ఇటీవలి కాలంలో నగరంలో ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరిగిన నేపధ్యంలో పోలీసు స్టేషన్ ఎదురుగానే ఈ సంఘటన జరగడంతో పోలీసులకు అప్రమత్తమయ్యారు. అయితే ప్రమాదం సాంకేతిక లోపం కారణంగానే జరిగిందని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఎస్‌ఐ రాఘవేందర్, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్‌కట్ట, భవానీనగర్‌కు చెందిన ఎండీ యూసుఫ్ ఆటో డ్రైవర్. తన ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకుని నయాపూల్ నుంచి సీతారామ్‌బాగ్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో అఫ్జల్‌గంజ్ పోలీసుస్టేషన్ ముందు ఆటో అకస్మాత్తుగా ఆగిపోవడంతో డ్రైవర్ ఇంజిన్ చెక్ చేస్తుండగా ఒక్కసారిగా ఆటోలో మంటలు చెలరేగాయి. ఈ దృశ్యాన్ని చూసిన పోలీసులు మంటలను ఆర్పేందుకు నీళ్లు చల్లారు. అప్పటికే ఆటో పూర్తిగా దగ్ధం అయ్యింది. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కేసును అఫ్జల్‌గంజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆటోలో మంటలు: అప్రమత్తమైన పోలీసులు
Published Thu, Mar 3 2016 8:14 PM | Last Updated on Thu, Mar 28 2019 6:19 PM
Advertisement