మీరు రోడ్డుపై వెళుతుంటే.. ఎవరైనా వ్యక్తి వచ్చి లిప్ట్ ఇస్తానంటే ఏం చేస్తారు.. అమ్మయ్యా! సమయానికి దేవుడిలా వచ్చాడంటూ గబగబా ఎక్కేస్తారు కదా! ..
అబిడ్స్: మీరు రోడ్డుపై వెళుతుంటే.. ఎవరైనా వ్యక్తి వచ్చి లిప్ట్ ఇస్తానంటే ఏం చేస్తారు.. అమ్మయ్యా! సమయానికి దేవుడిలా వచ్చాడంటూ గబగబా ఎక్కేస్తారు కదా! .. సరిగ్గా ఇలానే అనుకున్నాడో ఉస్మానియా ఆస్పత్రికి వెళుతున్న వైద్యుడు. వచ్చిన వాడు దేవుడైతే.. మంచిదే.. కానీ వచ్చింది దొంగ మరీ.. అసలు బుద్ది చూపించాడు.. లిఫ్టు పేరుతో వైద్యుడిని ఆటోలో ఎక్కించుకుని.. ఆపై అతడి వద్ద ఉన్న డబ్బును దోచుకుని పరారయ్యాడు. ఈ ఘటన షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎంజే బ్రిడ్జి వద్ద సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఎం. రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాలివీ.. లంగర్‌హౌస్‌లో నివాసముండే ఆర్థోపెడీషియన్ డాక్టర్ మీర్ అలియాస్ అలీ(54) సోమవారం మధ్యాహ్నం పాతబస్తీ జర్జ్‌ఖానా ఆస్పత్రి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి నడిచి వెళ్తున్నారు. ఇంతలోనే ఓ ఆటో డ్రైవర్ ఎంజే బ్రిడ్జిపై ఆటోను ఆపి ఉస్మానియా ఆస్పత్రి వరకు లిఫ్ట్ ఇస్తానంటూ డాక్టర్‌ను ఆటోలో ఎక్కించుకున్నాడు.
అప్పటికే ఆ ఆటోలో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత.. ముందు పోలీసుల తనిఖీలున్నాయని, వెంటనే దిగిపోవాలని డాక్టర్‌కు సూచించారు. దీంతో అలియాస్ అలీ ఆటోదిగి రూ.20 ఆటోవాలాకు ఇవ్వబోయాడు. అయితే, ఆటోలోని వారంతా అప్పటికే కిందికి దిగి డాక్టర్‌ను చుట్టుముట్టారు. బలవంతంగా ఆయన జేబులో ఉన్న రూ.20వేల నగదును లాక్కొని క్షణాల్లో పరారయ్యారు. దీంతో కంగుతిన్న బాధితుడు షాహినాయత్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై వెంకటేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.