
ఇక ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్!
వీడియో ఆధారిత సెన్సర్‌లను వినియోగించడం ద్వారా శాస్త్రీయమైన పద్ధతిలో డ్రైవింగ్ సామర్ధ్య పరీక్షలను నిర్వహించేందుకు..
♦ వీడియో సెన్సర్‌ల ఆధారంగా సామర్ధ్య పరీక్షలు
♦ కేరళ తరహాలో అమలుకు రవాణాశాఖ సన్నాహాలు
సాక్షి, సిటీబ్యూరో: వీడియో ఆధారిత సెన్సర్‌లను వినియోగించడం ద్వారా శాస్త్రీయమైన పద్ధతిలో డ్రైవింగ్ సామర్ధ్య పరీక్షలను నిర్వహించేందుకు రవాణాశాఖ సన్నద్ధమవుతోంది. కేరళలో విజయవంతంగా అమలవుతున్న ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్‌ల తరహాలో తెలంగాణలో డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలను ఆధునీకరించనుంది. డ్రైవింగ్ లెసైన్సుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ప్రస్తుతం నాగోల్, ఉప్పల్, కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నంలోని డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాల్లో మోటారు వాహన తనిఖీ అధికారులు పరీక్షలు నిర్వహించి సామర్ధ్యాన్ని నిర్ధారిస్తున్నారు.
ఈ విధానంలో ఏజెం ట్‌లు, మధ్యవర్తులు, డ్రైవింగ్ స్కూళ్ల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. దీంతో సరైన నైపుణ్యం లేని వారికి కూడా తేలిగ్గా డ్రైవింగ్ లెసైన్సులు వచ్చేస్తున్నాయి. నైపుణ్యం లేని డ్రైవర్‌లు రహదారి భద్రతకు సవాల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ పరీక్షలను మానవ ప్రమేయ రహితంగా పారదర్శకంగా నిర్వహించాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రవాణాశాఖ ఉన్నతాధికారుల బృందం కొద్ది రోజుల క్రితం కేరళకు వెళ్లి ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్‌లను అధ్యయనం చేసింది.
త్రివేండ్రమ్‌తో పాటు మరికొన్ని నగరాల్లో అమలవుతున్న ఈ పద్ధతిలో ఎంవీఐల జోక్యం ఉండదు. వీడియో సెన్సర్‌లే కీలకంగా పనిచేస్తాయి.ట్రాక్‌లో వాహనం నడిపే వ్యక్తి కదలికలను ఈ సెన్సర్‌లు నమోదు చేస్తాయి. ఈ కదలికల ఆధారంగా సదరు వ్యక్తి నైపుణ్యాన్ని కచ్చితంగా అంచనా వేస్తూ సర్టిఫికెట్ అందజేస్తారు. రవాణాశాఖ నిర్ధారించిన ప్రమాణాలకు విరుద్ధంగా వాహనాలు నడి పిన వారు ఫెయిల్ అయినట్లు సర్టిఫికెట్‌లు వస్తాయి.
కచ్చితమైన నిఘా...
ఇప్పటికే వివిధ రకాల పౌరసేవలను ఆన్‌లైన్ ద్వారా అమలు చేసేందుకు చర్యలు చేపట్టిన రవాణాశాఖ డ్రైవింగ్ పరీక్షల్లోనూ కేరళ తరహా విధానంపైన దృష్టి సారించింది. ప్రస్తుతం లెర్నింగ్ లెసైన్సు, డ్రైవింగ్ లెసైన్సు, వాహనాల రిజిస్ట్రేషన్, వాహనాల యాజమాన్య బదిలీ, డ్రైవింగ్ లెసైన్సుల రెన్యువల్ వంటి అన్ని రకాల పౌరసేవల కోసం వినియోగదారులు నేరుగా ఆర్టీఏకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఆన్‌లైన్ ద్వారా స్లాట్ సమోదు చేసుకొనే సదుపాయాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. డ్రైవింగ్ పరీక్షల్లో మాత్రం సాంకేతిక పరిజ్ఞానం కంటే ఎంవీఐల పరిశీలనే ప్రధానంగా ఉంది.
ఏజెంట్‌లు, మధ్యవర్తుల ద్వారా వచ్చే వారు ఎలాంటి పరీక్షలు లేకుండానే డ్రైవింగ్ లెసైన్సులు పొందుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటిని అరికట్టి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు ఈ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్‌లు దోహదం చేస్తాయి. ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాల్లోనే వీడియో సెన్సర్‌లను ఏర్పాటు చేయడం ద్వారా కంఫ్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో అభ్యర్ధులు వాహనం నడిపే తీరు, వేగం, వాహనం కండీషన్, పార్కింగ్ చేసే పద్ధతి, వాహనాన్ని వెనక్కి తీసుకోవడం, ఎత్తై ప్రాంతాల్లో, కచ్చా రోడ్లపైన, ట్రాఫిక్ రద్దీలో నడిపేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలపై కచ్చితమైన అంచనాలు ఉంటాయి.
అమలు దిశగా సన్నాహాలు...
కేరళ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలను నిర్వహిస్తున్న కెల్ట్రాన్ అనే సంస్థ భాగస్వామ్యంతోనే ఇక్కడ సైతం డ్రైవింగ్ కేంద్రాలను నిర్వహించాలని కోరుతూ రవాణాశాఖ ఉన్నతాధికారులు ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే వెంటనే అమలు చేయనున్నట్లు రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా ‘సాక్షి’తో చెప్పారు.