
బొట్టు బొట్టుకూ లెక్క!
నల్లాలకు ఆటోమేటిక్ రీడింగ్ మీటర్లు
♦ 22 వేల వాణిజ్య సంస్థలు, పరిశ్రమల్లో త్వరలో ఏర్పాటు
♦ జలమండలి సన్నాహాలు
♦ ప్రతి నెలా రూ.10 కోట్ల మేర ఆదాయం పెరిగే అవకాశం..
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ పరిధిలో పరిశ్రమలు, వాణిజ్య భవంతులకున్న నల్లా కనెక్షన్లకు ఆటోమేటిక్ నీటి మీటర్ల(ఏఎంఆర్) ఏర్పాటుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. బోర్డు పరిధిలోని 16 నిర్వహణ డివిజన్ల పరిధిలో ఉన్న 22 వేల వాణిజ్య, పరిశ్రమల కనెక్షన్లకు వీటిని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇదే విభాగంలో ఉన్న 1500 బడా సంస్థల నల్లాలకు ఇప్పటికే ఏఎంఆర్ నీటిమీటర్లను ఏర్పాటు చేయడంతో బోర్డు ఆదాయం బాగా పెరిగింది. దీంతో మిగతా వాటికి కూడా మరో నెలరోజుల్లో ఏఎంఆర్ మీటర్లను తప్పనిసరి చేసి ప్రతి నీటిబొట్టుకూ లెక్కతీయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం ఈ 22 వేల నల్లాలకు మెకానికల్ మీటర్ల ఆధారంగానే బిల్లులు జారీ చేస్తుండడంతో రోజువారీగా సరఫరా చేస్తున్న నీటిని శాస్త్రీయంగా లెక్కించడం సాధ్యపడడంలేదు. తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా జరిగినపుడు ఈ మీటర్లు సరిగా పనిచేయకపోవడంతో ఈ నిర్ణయానిక వచ్చినట్లు తెలిసింది. ఇందుకయ్యే వ్యయాన్ని సంబంధిత వినియోగదారుల నుంచే వసూలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. నీటి కనెక్షన్ పరిమాణం, నీటి వినియోగాన్ని బట్టి ఈ మీటర్ల ఖరీదు రూ.10 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఈ మీటర్ల ఏర్పాటుతో జలమండలి రెవెన్యూ ఆదాయం ప్రస్తుతం రూ.93 కోట్లుండగా.. అదనంగా మరో పదికోట్ల మేర పెరిగే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు.
పరిస్థితిని చక్కదిద్దేందుకే...
జలమండలి పరిధిలో ఉన్న 8.65 లక్షల నల్లాలకు రోజువారీగా 365 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తోంది. నీటి బిల్లుల ద్వారా నెలవారీగా రూ.93 కోట్ల ఆదాయం లభిస్తుండగా.. విద్యుత్ బిల్లులు, రుణవాయిదాలు, ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు, మరమ్మతులకు నెలకయ్యే వ్యయం రూ.95 కోట్లకు పైగానే ఉంది. మరోవైపు లీకేజీలు, నీటిచౌర్యం కారణంగా వందల కిలోమీటర్ల దూరం నుంచి నగరానికి సరఫరా చేస్తున్న నీటిపరిమాణంలో 40 శాతం మేర కోత పడుతుండడంతో బోర్డు ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆటోమేటిక్ నీటిమీటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఏఎంఆర్ మీటర్ల పనితీరు ఇలా...
వాణిజ్య, పరిశ్రమల నల్లాలకు ఏర్పాటు చేసే ఏఎంఆర్ మీటర్లు మొబైల్ ఫోన్ టెక్నాలజీలో వాడే జీఎస్‌ఎం సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పనిచేస్తాయి. ప్రతి మీటరును ఖైరతాబాద్‌లోని బోర్డు ప్రధాన కార్యాలయంలో ఉన్న సర్వర్‌కు అనుసంధానిస్తారు. దీంతో రోజువారీగా ప్రతి నల్లా కనెక్షన్‌కు ఎంత పరిమాణంలో నీటిని సరఫరా చేస్తున్నారు, బిల్లింగ్ ఏమేర జరుగుతుందో ఉన్నతాధికారులు పరిశీలిస్తారు. ఈ మీటర్లను ట్యాంపరింగ్ చేయడం వీలుకాదు. మరోవైపు వినియోగదారునికి కూడా పాస్‌వర్డ్ ఇచ్చే అవకాశం ఉండడంతో వినియోగదారులు సైతం నీటిసరఫరా, బిల్లింగ్ అంశాలను ఒక్క క్లిక్‌తో తెలుసుకునే సౌలభ్యం ఉంటుందని బోర్డు రెవెన్యూ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఇటీవల 1500 నల్లాలకు ఏర్పాటు చేసిన ఏఎంఆర్ మీటర్లతో బోర్డు రెవెన్యూ ఆదాయం క్రమంగా పెరిగిందని పేర్కొన్నాయి.