
గ్రేటర్ లో బెస్ట్ సేవలు
గ్రేటర్ ఆర్టీసీ ఇక కొత్త పుంతలు తొక్కనుంది. తాజాగాప్రజా రవాణా బాధ్యతను ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి అప్పగించడంతో సిటీబస్సు ముఖచిత్రం మారనుంది. ముంబయి తరహా రవాణా సదుపాయాలు హైదరాబాద్‌లో అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు రూ.360 కోట్ల భారీ నష్టాల్లో ఉన్న గ్రేటర్ ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ నుంచి లభించే రూ.218 కోట్ల సాయం ఊరట నివ్వనుంది. ‘బృహన్ ముంబయి ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్టు’ (బెస్ట్) సంస్థ తరహాలో సిటీలో ప్రజా రవాణాను జీహెచ్‌ఎంసీ పరిధిలోకి తేనున్నారు. దీంతో నగరంలో రవాణా సదుపాయాలు మెరుగుపడనున్నాయి. ఈ నేపథ్యంలో ముంబయి- గ్రేటర్‌లో ప్రజా రవాణా తీరుతెన్నులపై ‘సాక్షి’ కథనం..
అడుగులు ఇలా..
ముంబయి తరహాలో ప్రజా రవాణాను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం గతేడాది చర్యలు చేపట్టింది. అక్కడ అమలవుతున్న ‘క్యూ’ పద్ధతిని అమలు చేసేందుకు గత ఏడాది ఆగస్టులో రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, ఆర్టీసీ జేఎండీ రమణారావు, హైదరాబాద్ జేటీసీ టి. రఘునాథ్‌తో ఓ బృందం ముంబయిలో పర్యటించింది. బస్సుల నిర్వహణ, ఆన్‌లైన్ సేవలు, క్యూ పద్ధతి వంటి అనేక అంశాలను ఈ బృందం పరిశీలించి ‘క్యూ’ పద్ధతిని గ్రేటర్‌లో అమలు చేసేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. ఈ విధానాన్ని అబిడ్స్‌లో మొదట ప్రారంభించాలని భావించినా తగినన్ని బస్‌బేలు లేకపోవడంతో నిలిపివేశారు. ఇటీవల 219 చోట్ల బస్‌బేల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లో క్యూ పద్ధతి అమలు కావాలంటే కనీసం 1300 చోట్ల బస్‌బేలు అవసరమని ఆర్టీసీ పేర్కొంటోంది.
రహదారుల విస్తరణ జరగాలి
ముంబయితో పోల్చినపుడు హైదరాబాద్‌లో రహదారుల విస్తరణ చాలా తక్కువ. దీంతో ప్రజా రవాణా విస్తరణ అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నాయి. రోడ్డు నిర్మాణంలో లోపాల కారణంగా బస్సుల నిర్వహణ భారమవుతోంది. సకాలంలో ప్రయాణికులకు సేవలను అందించలేకపోతున్నాం. 34 లక్షల మంది ప్రయాణికులు ఉన్న హైదరాబాద్‌లో ఆర్టీసీ సేవలు మెరుగుపడాలంటే కనీసం 1000 కొత్త బస్సులు అవసరం.
- పురుషోత్తం నాయక్, ఆర్టీసీ గ్రేటర్ ఈడీ
స్కై వేల ఏర్పాటు అవసరం
ముంబయిలో స్కైవేలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల వద్ద ఎస్కలేటర్లు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. బస్‌స్టేషన్ నుంచి రైల్వేస్టేషన్‌కు చేరుకునేందుకు స్కైవేలు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. క్యూ పద్ధతికి కూడా బస్‌బేల ఏర్పాటు చాలా బాగుంది. ఇక్కడా అదే తరహాలో అభివృద్ధి చేయవలసి ఉంది.
- టి.రఘునాథ్, జేటీసీ హైదరాబాద్