
బీటెక్ దొంగ
చోరీ కేసులో ఇద్దరు యువకుల అరెస్ట్ రిమాండ్
18.5 తులాల బంగారం స్వాధీనం
సైదాబాద్: అతనో విద్యార్థి.. ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అయితే డబ్బుపై ఉన్న ఆశ అతడిని పెడతోవ పట్టించింది.. తన ఇంటి ముందు ఒం టరిగా నివసిస్తున్న వృద్ధురాలి ఇంటిపై అతని కన్నుపడింది. అనుకున్న పనిని పూర్తి చేసినా చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. సైదాబాద్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ కొరుట్ల నాగేశ్వర్‌రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. చంపాపేట సమీపంలోని రెడ్డిబస్తికి చెందిన రామవర్థనమ్మ(80) భర్త చనిపోవడంతో ఒంటరిగా నివసిస్తుంది. వీరి ఇంటి ఎదురుగా ఉండే అభిషేక్ సైదాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
వర్ధనమ్మతో పరిచయం పెంచుకున్న అతను ఆమెతో తరచూ మాట్లాడుతూ అప్పుడప్పుడు అవసరానికి డబ్బులు తీసుకునేవాడు. అయితే ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బు సంపాందించాలనే దురాశతో రామవర్థనమ్మ ఇంటికి కన్నం వేసేందుకు నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడు ప్రణయ్‌తో కలిసి ఈ నెల 24న వృద్దురాలి ఇంట్లోకి వెళ్లి ఆమె దృష్టి మరల్చి బీరువాలో ఉన్న 18.5 తులాల బంగారు ఆభరణాలను తస్కరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపి అభిషేక్‌పై అనుమానంతో తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించాడు. సైదాబాద్ పోలీసులు శనివారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.