ముస్లింలు.. సంచలన నివేదిక | Backwardness than the SCs and STs | Sakshi
Sakshi News home page

ముస్లింలు.. సంచలన నివేదిక

Published Sun, Dec 11 2016 4:54 AM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM

ముస్లింలు.. సంచలన నివేదిక

ముస్లింలు.. సంచలన నివేదిక

- ముస్లింల స్థితిగతులపై సుధీర్‌ కమిటీ నివేదిక
- గత 40 ఏళ్లలో బాగా.. ఎస్సీ, ఎస్టీల కన్నా వెనకబడిపోయారు
- అక్షరాస్యత, తలసరి ఆదాయం, వ్యయం అందరికంటే తక్కువ
- 16 శాతం ముస్లిం జనాభా పాఠశాల ముఖమే చూడలేదు


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ముస్లిం సామాజికవర్గం ఎస్సీ, ఎస్టీల కన్నా వెనుకబడిందని జి.సుధీర్‌ కమిషన్‌ తేల్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.51 కోట్లుకాగా అందులో 12.68 శాతం (44.64 లక్షలు)ఉన్నారని... కానీ వారి సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆరోగ్య స్థితిగతులు అట్టడుగు స్థాయిలో ఉన్నాయని పేర్కొంది. గత నలభై ఏళ్లలో బాగా వెనుకబడిపోయారని స్పష్టం చేసింది.

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలను అభివృద్ధిలో భాగస్వాములు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. జనాభా దామాషా ప్రకారం ముస్లింలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. దీనికి సంబంధించి రాష్ట్రంలోని ముస్లింల సామాజిక–ఆర్థిక, విద్యా స్థితిగతులపై అధ్యయనం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ జి.సుధీర్‌ అధ్యక్షతన ఎంఏ బారి, డాక్టర్‌ అమీరుల్లా ఖాన్, ప్రొ. అబ్దుల్‌ షాబాన్‌లతో కూడిన ఈ కమిటీ.. విస్తృతంగా అధ్యయనం చేసి, ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. తాజాగా ఆ నివేదికను బహిర్గతం చేసింది. కమిషన్‌ నివేదికలోని ముఖ్యాంశాలు..

40 ఏళ్లలో బాగా వెనకబడ్డారు
నలభై ఏళ్ల కింద సగటు స్థాయిలో ఉన్న ముస్లింలు ఇప్పుడు అందరికన్నా.. కొన్ని విషయాల్లో ఎస్సీ, ఎస్టీల కన్నా కూడా వెనుకబడిపోయారు. నేషనల్‌ శాంపుల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) గణాంకాల ప్రకారం.. 1999లో సగటు పౌరులతో పోలిస్తే స్వల్పంగా దిగువన ఉన్న ఓబీసీలు ప్రస్తుతం అగ్రవర్ణాలకు సమాన స్థాయిలో ఉన్నారు. అప్పట్లో ఓబీసీలకు సమానంగా ఉన్న ముస్లింలు ఇప్పుడు చాలా వెనకబడి పోయారు. 1999–2011 మధ్య కాలంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల తలసరి ఆదాయ వృద్ధితో పోలిస్తే ముస్లింల తలసరి ఆదాయ వృద్ధి రేటు సగం మాత్రమే. 2004–12 మధ్య ముస్లింల తలసరి వ్యయం 60 శాతం పెరగగా... హిందూ ఎస్టీల్లో 69 శాతం, ఎస్సీల్లో 73 శాతం, ఓబీసీల్లో 89 శాతం, అగ్రవర్ణాల్లో 122 శాతం పెరిగింది. దారిద్య్రరేఖకు దిగువన హిందూ ఎస్సీల కన్నా ముస్లిం ఓబీసీల నిష్పత్తే ఎక్కువ.

మధ్యలోనే చదువులకు ఫుల్‌స్టాప్‌
ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండడంతో ముస్లింలు మధ్యలోనే చదువులకు స్వస్తి చెబుతున్నారు. పాఠశాల ముఖమే చూడని జనాభాలో అత్యధికంగా ఎస్టీలు, ముస్లింలే ఉండడం గమనార్హం. ఎస్టీల్లో 17శాతం, ముస్లింలలో 16 శాతం జనాభా అసలు విద్యా సంస్థల్లోనే చేరలేదు. ముస్లింల అక్షరాస్యత రేటు (70%) ఓబీసీల్లో (74శాతం)కన్నా, సాధారణ హిందువుల (86శాతం) కన్నా తక్కువగా ఉందని 2014లో అమితాబ్‌ కుందు నేతృత్వంలోని సచార్‌ ఎవాల్యుయేష న్‌ కమిటీ బహిర్గతం చేసింది. ఉన్నత విద్య విషయంలో ముస్లింల పరిస్థితి  దయనీయం గా ఉంది. తెలంగాణలో వర్సిటీల పరిధిలోని అన్ని కోర్సుల్లో ముస్లిం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని వర్సిటీల నుంచి సేకరించిన సమాచారం స్పష్టం చేస్తోంది.

సర్కారీ దవాఖానే దిక్కు
పేదరికం కారణంగా ముస్లింలు చాలా వరకు ప్రభుత్వ ఆస్పత్రులకే వెళుతున్నా రు. వైద్య సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం, పేద రికం, మురికివాడల్లో నివాసం వల్ల ముస్లిం వయోజనుల ఆరోగ్యం బాగా లేదు. ఈ కారణాల వల్లే హిందువులు (62శాతం), క్రైస్తవుల (49.6 శాతం)తో పోల్చితే ముస్లిం గర్భవతు ల్లో(66శాతం) రక్తహీనత అధికం. ఇతరులతో పోల్చితే ముస్లిం పురుషులు ఎక్కువగా మధుమేహంతో బాధపడు తున్నారు. ముస్లిం పిల్లల ఆరోగ్య పరిస్థితి ఇతరుల కంటే మెరుగ్గా ఉంది. ముస్లింలలో మాతా, శిశు మరణాల రేటు తక్కువే.

‘నివాసం’లోనూ వివక్ష
హౌజింగ్‌ మార్కెట్‌ ముస్లింలపై వివక్ష చూపి స్తోందన్న భావన ఉందని కమిటీ అభిప్రా యపడింది. గృహ సదుపాయం పొందడంలో ముస్లింలు ఇబ్బందులు పడుతున్నారని.. 43 శాతం ముస్లింలు అద్దె ఇళ్లలోనే నివసిస్తున్నారని పేర్కొంది. ముస్లింల హౌజింగ్‌ పరిస్థితిపై లోతైన పరిశీలన జరపాలని ప్రభుత్వానికి సూచించింది.

లింగపర అసమానతలూ ఎక్కువే..
ఇతర మతాలతో పోల్చితే ముస్లింలలో లింగపర అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. ముస్లిం మహిళల్లో 21–29 ఏళ్ల మధ్య వయసు గలవారిలో 71.5 శాతం మంది మధ్యలోనే చదువులు మానేస్తున్నారు. అదే 18–20 ఏళ్ల మధ్య వయసు వారిలో 52.8శాతం మంది మధ్యలోనే చదువు మానేస్తున్నారు. మొత్తంగా 21–29 ఏళ్ల వయసులో మధ్యలోనే చదువు మానేస్తున్న వారిలో 85.2 శాతం ముస్లిం మహిళలే ఉన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల్లో 7.36 శాతమే!  

∙మొత్తం ఉద్యోగులు 4,79,556.. వారిలో ముస్లింలు 35,279
∙ముస్లిం గెజిటెడ్‌ అధికారులు 1.43 శాతమేనని సుధీర్‌ కమిటీ వెల్లడి
∙340 మంది అఖిల భారత సర్వీసు అధికారుల్లో 10 మందే ముస్లింలు


రాష్ట్ర జనాభాలో 12.68 శాతం ముస్లింలు ఉండగా... ప్రభుత్వ ఉద్యోగాల్లో వారు 7.36 శాతమే ఉన్నారని జి.సుధీర్‌ కమిటీ తమ నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలోని 23 ప్రభుత్వ శాఖలు, సచివాలయం, జిల్లాల్లోని ప్రభుత్వ శాఖల్లో కలిపి మొత్తం 4,79,556 మంది ఉద్యోగులు ఉండగా.. అందులో ముస్లిం ఉద్యోగులు 35,279 (7.36 శాతం) మందేనని తెలిపింది. అఖిల భారత సర్వీసు అధికారులు 340 మంది ఉండగా.. అందులో ముస్లింలు కేవలం 10 మందేనని, ఇందులోనూ ముస్లిం మహిళలకు ప్రాతినిధ్యమే లేదని వివరించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన కమిటీ.. పలు కీలక అంశాలను గుర్తించింది. ముస్లిం ఉద్యోగుల్లో 56.57 శాతం అట్టడుగు స్థాయి (ఆఫీస్‌ సబార్డినేట్, వాచ్‌మెన్, స్వీపర్, ఇతర నాలుగో తరగతి) ఉద్యోగులేనని తేల్చింది. ఇక 42 శాతం నాన్‌ గెజిటెడ్‌ అధికారులని, కేవలం 1.43 శాతం మాత్రమే గెజిటెడ్‌ అధికారులని తెలిపింది.

వ్యవసాయేతర పనులే జీవనాధారం
రాష్ట్రంలోని ముస్లింలకు వ్యవసాయేతర పనులే జీవనాధారం. హిందూ పురుషుల్లో 61 శాతం సొంత కమతాల్లో ఉండగా.. 38 శాతం మంది వ్యవసాయ రంగంలో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. ముస్లిం పురుషుల్లో 52 శాతం మంది దినసరి కూలీలుగా, 48 శాతం మంది స్వయం ఉపాధి రంగంలో ఉన్నారు.

జనాభా వృద్ధి రేటు తగ్గుతోంది  

2001–2011 మధ్య ముస్లిం జనాభా వృద్ధి 1.47%
పట్టణాల్లోనే ఎక్కువ నివాసం
సుధీర్‌ కమిషన్‌ నివేదిక స్పష్టీకరణ

రాష్ట్రంలో ముస్లింల జనాభా వృద్ధి రేటు క్రమంగా తగ్గుతోంది. గత దశాబ్దకాలంలో హిందువుల వృద్ధి రేటు 0.47 శాతం తగ్గిపోగా... ముస్లిం వృద్ధి రేటు అంతకు మించి 0.52 శాతం పడిపోయింది. జి.సుధీర్‌ కమిషన్‌ నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 1991–2001 మధ్య తెలంగాణ జనాభా వృద్ధి రేటు 1.78 శాతంకాగా... హిందువుల జనాభా వృద్ధి రేటు 1.64 శాతం, ముస్లిం జనాభా వృద్ధి రేటు 1.99, క్రైస్తవ జనాభా వృద్ధి రేటు 3.19 శాతం ఉండేది. అయితే 2001–2011 మధ్య రాష్ట్ర జనాభా వృద్ధి రేటు 1.27 శాతానికి పడిపోగా... హిందూ జనాభా వృద్ధిరేటు 1.17 శాతం, ముస్లింల జనాభా వృద్ధి రేటు 1.47 శాతం, క్రైస్తవుల జనాభా వృద్ధి రేటు 1.51 శాతానికి తగ్గిపోయింది.

పట్టణాల్లోనే ఎక్కువ..
మొత్తం రాష్ట్ర జనాభా 3.51 కోట్లుకాగా అందులో 12.68 శాతం (44,64,699 మంది) ముస్లింలు ఉన్నారు. పట్టణ జనాభాలో 24శాతం, గ్రామీణ జనాభాలో 5.05 శాతం ముస్లింలు ఉన్నారు. అత్యధికంగా హైదరాబాద్‌ జనాభాలో 43.4 శాతం, అత్యల్పంగా నల్లగొండ జిల్లాలో 5.2 శాతం ముస్లింలు ఉన్నారు. రాష్ట్ర ముస్లిం జనాభాలో 50.01 శాతం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కేంద్రీకృతమై ఉంది. రాష్ట్రంలో పశ్చిమ, వాయవ్య ప్రాంతాల్లో ఎక్కువగా ఉండి.. తూర్పు దిశగా వెళ్లే కొద్దీ ముస్లింల జనాభా తగ్గుతూ వచ్చింది. రాష్ట్ర ముస్లిం జనాభాలో షేక్, షేయిక్‌ వర్గాల వారు 66.2 శాతం, సయ్యద్‌లు 11.5 శాతం, పఠాన్‌లు 6.12 శాతం ఉన్నారు. ముస్లింల కుటుంబాల సగటు పరిణామం ఇతరులతో పోల్చితే పెద్దగా ఉంది. ఇతరుల కుటుంబాల్లో సగటున 4.8 మంది ఉండగా... ముస్లిం కుటుంబాల్లో సగటున 5.2 మంది ఉన్నారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 99 శాతం సున్నీలు, 1 శాతం మాత్రమే షియాలు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో 99.3 శాతం సున్నీలు, 0.7 శాతం షియాలు ఉన్నారు.

12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి  
ముస్లింలకు కనీసం 9 శాతమైనా కల్పించాలన్న సుధీర్‌ కమిటీ
అందరికీ సమాన అవకాశాల కోసం కమిషన్‌ ఏర్పాటు చేయాలని సూచన


రాష్ట్రంలో ముస్లింలు చాలా వెనుకబడినందున వారికి రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలని జి.సుధీర్‌ కమిటీ సిఫారసు చేసింది. కనీసం 9 శాతమైనా కల్పిం చాలని సూచించింది. న్యాయ నిపుణుల సల హాలు తీసుకుని, తమిళనాడు తరహాలో రిజ ర్వేషన్ల కోసం చట్టాన్ని రూపొందించాలని కమిటీ తాజాగా వెల్లడించిన తమ నివేదికలో ప్రతిపాదించింది. ‘ఇంద్రా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రతిపాదనల ఆధా రంగా గమనిస్తే ముస్లింలు పలు విషయాల్లో రాష్ట్ర సగటు కన్నా దిగువన ఉన్నారు. సామా జికంగా, విద్యాపరంగా వెనుకబడ్డారు. అందు వల్ల ప్రభుత్వం వారికి రిజర్వేషన్లు కల్పించాలి. 82% ముస్లింలు వెనకబడినవారుగా వర్గీక రించిన దృష్ట్యా వాళ్ల రిజర్వేషన్లను 4  నుంచి 12 శాతానికి పెంచాలి. కనీసం 9 శాతానికైనా పెంచాలి’’ అని కమిటీ పేర్కొంది.

ఎస్సీల తరహా వృత్తి చేస్తూ వివక్ష ఎదుర్కొంటున్న మెహ్తర్‌ వంటి ముస్లిం వర్గాలకు ఎస్సీ హోదా కింద రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది. సామాజిక, మత, కుల, భాషాపర వివక్షకు తావులేకుండా ప్రైవేటు, పబ్లిక్‌ రంగాలతో సహా అన్ని చోట్లా, అన్నివర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించేందుకు సమాన అవకాశాల కమిషన్‌ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అన్ని స్థాయిల్లో విద్య, ఉద్యోగం, గృహ వసతి, ఆరోగ్య సదు పాయం, అభివృద్ధి ప్రోత్సాహకాలపై ఆ కమిషన్‌ పర్యవేక్షణ ఉండాలంది. కమిటీ తమ సిఫారసులను 3 భాగాలుగా విభజించింది. తక్షణమే అమలు చేయాల్సిన కీలక అంశాలతో పాటు మధ్యంతర, దీర్ఘకాలిక సిఫారసులను నివేదికలో సూచించింది.

మధ్య కాలిక సిఫార్సులు
► ఎస్సీ, ఎస్టీల తరహాలో ముస్లిం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు టీఎస్‌ఐపాస్‌ కింద రాయితీలు అందించాలి. టీఎస్‌ఐఐసీ ద్వారా ముస్లింలకు 12 శాతం పారిశ్రామిక స్థలాలు మంజూరు చేయాలి.
► పారిశ్రామిక ప్రోత్సాహకాల్లో 12% ముస్లింలు స్థాపించిన యూనిట్లకు అందజేయాలి.
► ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల్లో ముస్లింల కోటాను పట్టణ ప్రాంతాల్లో 20 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 10 శాతానికి పెంచాలి.
► అఖిల భారత సర్వీసు ఉద్యోగాల్లో ముస్లింల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. స్టేట్‌ సర్వీసుల నుంచి ప్రమోషన్లు ఇచ్చి ఈ అంతరాన్ని పూరించాలి.
► ముస్లిం కుటుంబాలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రుణాలు లభించడం దుర్లభంగా మారింది. ఈ పరిస్థితిని మార్చాలి.
► ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించిన సెలెక్షన్‌ ప్యానెల్‌లో కనీసం ఒక ముస్లిం అకడమీషియన్‌ ఉండాలి. శాఖాపర పదోన్నతుల్లో సైతం ముస్లింలకు న్యాయం జరిగేలా బోర్డులో ఒక ముస్లిం సభ్యుడు ఉండాలి.
► రాష్ట్ర మైనారిటీస్‌ కార్పొరేషన్‌ను బలోపేతం చేయాలి. రెవెన్యూ డివిజన్, మున్సిపాలిటీ కేంద్రాల్లో కార్పొరేషన్‌ కార్యాలయాలను తెరిచి సిబ్బందిని నియమించాలి.
► మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్లల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి.
► మదర్సాల మౌలిక పాఠ్య ప్రణాళికలో జోక్యం చేసుకోకుండా వాటిని ప్రధాన స్రవంతి పాఠశాలల్లో కలిపి, మామూలు పాఠశాలలుగా గుర్తించాలి. మదర్సాల్లో సైన్స్, గణితం సబ్జెక్టులు బోధించేలా సూచనలివ్వాలి. మదర్సా బోర్డును స్థాపించి అందులో చేరేందుకు అన్ని మదర్సాలకు అవకాశం కల్పించాలి. మదర్సా కోర్సులకు రెగ్యులర్‌ కోర్సులతో సమాన హోదా కల్పించాలి.
► మొత్తం జనాభాలో, ప్రత్యేకంగా ముస్లింలలో రక్తహీనత కేసులు పెరగకుండా చూడాలి.
► ముస్లింలు, ఇతర మత గ్రూపుల వేతనాల మధ్య వ్యత్యాసం ఉంది. రాష్ట్రంలోని ముస్లింలకు కనీస వేతన చట్టాలు కచ్చితంగా వర్తించేలా చూడాలి.

తక్షణమే అమలు చేయాల్సిన సిఫార్సులు
► రాష్ట్ర బడ్జెట్‌లో ముస్లింల కోసం ప్రత్యేక సబ్‌ప్లాన్‌ రూపొందించి.. అన్ని శాఖలు ముస్లింల సంక్షేమం కోసం తగినన్ని నిధులు వెచ్చించేలా చర్యలు తీసుకోవాలి. నిధులు దారిమళ్లకుండా చూడాలి.
► సచార్, కుందూ కమిటీల సిఫారసుల మేరకు భిన్నత్వ సూచికల (డైవర్సిటీ ఇండెక్స్‌)ను ప్రభుత్వం అమలు చేయాలి. మానవ వనరుల విషయంలో ప్రదర్శించే భిన్నత్వం ఆధారంగా సంస్థలకు ర్యాంకులు ఇవ్వాలి.
► ఉపాధ్యాయుల కొరత, బోధనా నాణ్యత లేక ఉర్దూ పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారింది. తక్షణమే ఉపాధ్యాయులను నియమించాలి. నిరుపేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం, స్కూళ్లలో డ్రాపౌట్లను తగ్గించడం కోసం స్కాలర్‌షిప్పులను పెంచాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తరహాలోనే ముస్లిం విద్యార్థులకు విద్యాసంస్థల్లో క్యాష్‌లెస్‌ ప్రవేశాలకు అవకాశం కల్పించాలి.
► ముస్లిం ప్రజానీకం పోలీసు, భద్రతా వ్యవస్థలపై నమ్మకంతో ఉంది. ఆ భావనని మరింత పెంపొందించేందుకు వారిపట్ల పోలీసుల వైఖరి మార్చాలి (సెన్సిటైజ్‌ చేయాలి). ముస్లిం యువకులను ఉగ్రవాదు లు, నేరస్తులన్న అనుమానంతో విచక్షణా రహితంగా అరెస్టు చేయడం ఆపాలి.  
► రెండో అధికార భాషగా ఉర్దూ అమలుకు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆఫీసులకు ఉర్దూలోనూ సైన్‌బోర్డులు పెట్టాలి.

దీర్ఘకాలిక సిఫార్సులు
► పాఠశాలల్లో ప్రవేశాలతో సహా ప్రభుత్వ సర్వీసుల్లో, విద్యా సంస్థల్లో ముస్లింలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి.
► ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లిం మహిళల ప్రాతినిధ్యం పెంచాలి. ముస్లిం రిజర్వేషన్లలో 33 శాతం ముస్లిం మహిళలకు ఇవ్వాలి.
► ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ప్రాథమిక, ప్రాథమి కోన్నత, ఉన్నత పాఠ శాలలను ఏర్పాటు చేయాలి. ఉన్నత విద్య లో ఆడపిల్లల ప్రాతినిధ్యం తక్కువగా ఉ న్నందున వారి కోసం ఉన్నత పాఠశాలలు, కళాశాలలను ఆంగ్ల మాధ్యమంలో తెరవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement